నర్సాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఐడీ విచారణకు హాజరు కాలేదు. సీఐడీ నోటీసులపై తాను హైకోర్టును ఆశ్రయించానని.. అనారోగ్య కారణాల రీత్యా తనకు నాలుగు వారాల సమయం కావాలంటే సీఐడీ ఏడీజీకిలేఖ రాశారు. సంక్రాంతి పండుగ ముందు హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంలో ఆయనకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. పదమూడో తేదీనే హాజరు కావాలని చెప్పారు. తాను రాలేనని చెప్పడంతో పదిహేడో తేదీకి మార్చి ఇచ్చారు. అప్పుడు మీడియాతో మాట్లాడిన రఘురామ .. తాను విచారణకు హాజరవుతానన్నారు.
అయితే ఇటీవల తనను చంపడానికి వైఎస్ఆర్సీపీ పెద్దలు జార్ఖండ్‌కు చెందివ వారితో ఒప్పందం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. విచరాణ పేరుతో పిలిపించి హత్య చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాదు ఆయనపై ఏపీలో పలు చోట్ల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అరెస్ట్ చేస్తారేమోనన్న ఆందోళనతో కూడా ఆయన విచారణకు హాజరు కాకుండా ఆగిపోయినట్లుగా తెలుస్తోంది.
రఘురామ విచారణకు హాజరు కాకపోవడంతో సీఐడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన బెయిల్ షరతుల్లో విచారణకు హాజరు కావాలని ఉంది. హాజరు కాకపోతే… ఆ విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్లి వారెంట్ జారీ చేయించుకునే అవకాశం ఉంది. ఒక వేళ ఆయన విచారణకు హాజరు అయినా.. కొత్తగా నమోదైన అట్రాసిటీ కేసుల్లోనూ అరెస్ట్ చూపే అవకాశం ఉంది. దీంతో అసలు ఢిల్లీలోనే ఉండాలని రఘురామ నిర్ణయించుకున్నారు.