విజయసాయిరెడ్డికి ఏదీ కలసి రావడం లేదు. పార్లమెంట్లో రాజ్యాంగ ఆమోద దినోత్సవానికి హాజరైన రఘురామకృష్ణరాజును ప్రధాని నరేంద్రమోడీ నోరారా పలకరించారు. రాజుగారు.. బాగున్నారా.. అని పలకరించడంతో రఘురామ కూడా హ్యాపీగా ఫీలయ్యారు. బాగున్నానని చెప్పారు. ప్రధాని అందర్నీ పలకరించలేరు. కానీ అలా పలకరించిన కొంత మంది మాత్రం స్పెషల్ అని అనుకోవచ్చు. గతంలోనూ రఘురామకృష్ణరాజును ప్రధాని ప్రత్యేకంగా ఇలాగే పలకరించారు. నిజానికి ఇలాంటి పలకరింపులు గతంలో విజయసాయిరెడ్డికి దక్కేవి.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఎక్కువగా పీఎంవో ముందే ఉండేవారు. అలా అలవాటయిపోయిందో.. లేక మరేదైనా కారణం ఉండేదేమో కానీ పార్లమెంట్ సెంట్రల్ హాల్ లేకపోతే ఇతర సమావేశాల్లో పాల్గొని వస్తున్నప్పుడు ఎక్కడైనా దూరంగా విజయసాయిరెడ్డి కనిపిస్తే హాయ్ విజయ్ గారూ అనేవారు మోడీ. కానీ ఇప్పుడు ఆ పలకరింపులు తగ్గిపోయాయి. ఇప్పుడు రఘురామకృష్ణరాజును మోడీ పలకరిస్తున్నారు.
వైసీపీతో … వైసీపీ అధినేతతో రఘురామరాజు చేస్తున్న పోరాటం బీజేపీ పెద్దలకు తెలియదని అనుకోలేం. ఆయనపై అనర్హతా వేటు కోసం జగన్ పట్టుబడుతున్నారు. కానీ పట్టించుకోవడం లేదు. పైగా ఆయనను బీజేపీలో చేర్చుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇటీవల అమిత్ షా అదే చెప్పారు. మోడీ, షాల ఆత్మీయ పలకరింపులతో రఘురామకృష్ణరాజు బీజేపీలో చేరికకు రంగం సిద్ధమవుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఆయన ఎంపీ కాబట్టి.. వైసీపీ సస్పెండ్ చేస్తేనే బీజేపీలో చేరగలరు. లేకపోతే ఎన్నికలకు ముందు చేరాలి. వైసీపీ కూడా ఆయన ఎక్కడ బీజేపీలో చేరుతారోనని సస్పెండ్ చేయడం లేదు. కానీ రెబల్ ఎంపీగా ఆయన పలుకుబడి మాత్రం అమాంతం పెరుగుతోంది. ఇప్పుడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డి కన్నా రఘురామకే ఎక్కువ గుర్తింపు ఉంది.