నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రఘురామకృష్ణరాజుపై పెట్టిన కేసుల్లో కస్టోడియల్ విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ వ్యాఖ్యలన్నీ తాను చేశానని రఘురామకృష్ణరాజు ఒప్పుకున్నారని.. అవన్నీ రికార్డుల రూపంలో ఉన్నాయని సీఐడీ చెబుతున్నందున ఇక కస్టడీ అవసరం లేదని.. సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ కేసు గురించి పిటిషనర్ రఘురామకృష్ణరాజు మీడియా.. సోషల్ మీడియాతో ఎక్కడా మాట్లాడకూడదని ఆదేశించింది. గాయాలను కూడా మీడియాకు చూపించవద్దని స్పష్టం చేసింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని.. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సమాచారం ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో స్పందించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా తెలిపింది.
రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్… ఆయనపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించిన అంశంపై దాఖలైన పిటిషన్ల విషయంలో రోజుంతా హైవోల్టేజ్ వాదనలు సాగాయి. విచారణ ప్రారంభమైన తర్వాత సుప్రీంకోర్టు న్యామమూర్తులు.. సీల్డ్ కవర్లో ఆర్మీ ఆస్పత్రి నుంచి వైద్య నివేదికను చదివి వినిపించారు. అందులో రఘురామకృష్ణరాజు కాలికి గాయాలున్నట్లుగా తెలిపింది. ఆయన కాలులో ఓ వేలు ఫ్రాక్చర్ అయింది. అలాగే.. కాళ్ల వాపులున్నాయి. రక్తం గడ్డకట్టిన ఛాయలున్నాయి. అయితే ఆ దెబ్బలుఎలా వచ్చాయో నివేదికలో లేదు. ఆస్పత్రి వైద్యులను ఆరోగ్య పరిస్థితిపై నివేదిక మాత్రమే సుప్రీంకోర్టు అడిగింది. గాయాలుంటే .. అవి ఎలా వచ్చాయో చెప్పాలని కోరడం ఊహాజనితం అవుతుంది.
రఘురామకృష్ణరాజు ఆరోపించినట్లుగా.. లాఠీలతో కొట్టినట్లుగా దెబ్బలు ఉన్నాయని.. ఫ్రాక్చర్ కూడా ఉందని రిపోర్ట్ రావడంతో సంచనలం సృష్టించింది. ఈ అంశంపై వాదోపవాదనలు జరిగాయి. రఘురామకృష్ణరాజు తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఆర్మీ ఆస్పత్రి నివేదికలో ధర్డ్ డిగ్రీ ప్రయోగించడం నిజమని తేలిందని.. రఘురామకు బెయిల్ మంజూరు చేసి.. అసలు మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. సీఎం జగన్ బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేసి పోరాడుతున్నందునే కసి పెంచుకున్నారని.. రాజద్రోహం కేసులన్నీ బోగస్ అని వాదించారు. ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర జరిగితేనే రాజద్రోహం అని ఆయన ధర్మాసనానికి తెలిపారు. బెయిల్ రాకుండా ఉండేందుకే ఆ సెక్షన్ పెట్టారని వాదించారు.
అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే.. మొదట్లో.. ఆర్మీ ఆస్పత్రి ఇచ్చిన నివేదికను తప్పు పట్టే ప్రయత్నం చేశారు. తర్వాత నివేదికను అంగీకిరస్తున్నామని చెప్పుకొచ్చారు కానీ… గుంటూరు ఆస్పత్రి ఇచ్చిన రిపోర్ట్ కూడా కరెక్టేనని చెప్పుకొచ్చారు. గాయాలు రఘురామకృష్ణరాజే చేసుకున్నారన్నట్లుగా వాదనలు వినిపించారు. అసుల బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు రావడమే తప్పన్నట్లుగా వాదించారు. సీబీఐ విచారణ కోరడం కరెక్ట్ కాదన్నారు.
మరో వైపు రఘురామ కుటుంబసభ్యుల ఫిర్యాదుపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి పంపారు. రఘురామ అంశంపై వెంటనే నివేదిక ఇవ్వాలని హోంశాఖను స్పీకర్ కార్యాలయం కోరింది. ఫిర్యాదు కాపీని హోంశాఖకు పంపారు.