రాజీనామా విషయంలో నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు యూటర్న్ తీసుకున్నారు. తాను ఇప్పుడల్లా రాజీనామా చేయబోనని ప్రకటించారు. తనపై అనర్హతా వేటు వేయించడం తన వల్ల కాదని జగన్ ప్రకటించి.. తనను రాజీనామా చేయాలని అంటే అప్పుడు రాజీనామా చేస్తానన్నారు. తనపై అనర్హతా వేటు వేయించేందుకు ఈ నెల పదకొండో తేదీ వరకూ గడువు ఇచ్చానని ఆయన చెప్పుకొచ్చారు.
కొద్ది రోజులుగా రఘురామ ఫిబ్రవరి వరకూ వైసీపీకి గడువు ఇస్తున్నానని తనపై అనర్హతా వేటు వేయించాలని లేకపోతే తానే రాజీనామా చేసి నర్సాపురంకు ఉపఎన్నికలకు వెళ్తానని ప్రకటించారు. అమరావతి ఎజెండాగా ఎన్నికలకు వెళ్తానన్నారు. ఇటీవల రఘురామపై వైసీపీ ఇచ్చిన అనర్హతా పిటిషన్ ను స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపారు. దీంతో నిర్ణయం తీసుకుంటారని అనుకున్నారు. అయితే ఆ ప్రక్రియ ఇంకా సమయంతో కూడుకున్నదని అంచనా వేస్తున్నారు.
ఈ కారణంగా రఘురామపై అనర్హతా వేటు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే ఉపఎన్నికలకు వెళ్తారని అనుకున్న రఘురామ కూడా వెనక్కి తగ్గారు. జగన్ తన వల్ల కాదని చెబితేనే రాజీనామా చేస్తానని అంటున్నారు. అంటే.. ఇక రఘురామకు రాజీనామా చేసే ఉద్దేశం లేదని.. నర్సాపురం ఉపఎన్నిక రాదని అనుకోవచ్చని రాజకీయవర్గాలు ఓ నిర్ణయానికి వస్తున్నాయి.