ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉందో.. నర్సాపురం ఎంపీ రఘురామరాజు ఆయన సొంత నియోజకవర్గానికి ఏళ్ల తరబడి వెళ్లలేకపోవడమే సాక్ష్యంగా కనిపిస్తోంది. ఆయనపై కరుడు గట్టిన నేరాలు చేసిన కేసులేం లేవు. కానీ ఆయన నియోజకవర్గానికి వస్తే ఏదో ఓ కేసులు.. ఎవరితో ఒకరితో పెట్టించి అరెస్ట్ చేయడం ఖాయం అని వైసీపీ నేతలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆయన గతంలో రెండు, మూడు సార్లు నర్సాపురం వెళ్లాలని ప్రయత్నించినా అరెస్టుకు అన్ని కుట్రలూ పన్నారని తెలుసుకుని ఆగిపోయారు. అయితే ఆయనను హైదరాబాద్ నుంచే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అది వేరే విషయం.
ప్రతి సంక్రాంతిని నర్సాపురంలో వైభవంగా జరుపుకోవడం ఆయనకు అలవాటు. కానీ గత రెండు, మూడేళ్లుగా ఆయన నర్సాపురంవైపు వెళ్లలేకపోయారు. ఈ సారి అయినా వెళ్లాలని హైకోర్టును ఆశ్రయించారు. తనపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలు ఇప్పించాలని.. గతంలో డీజీపీని కోరినా ఇవ్వలేదన్నారు. తాను తన నియోజకర్గ పర్యటనకు వెళ్తే ఏదో ఓ కేసు పెట్టి అరెస్ట్ చేయించే అవకాశం ఉందని తన పిటిషన్లో రఘురామ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రఘురామ తరపు లాయర్ ఈ అంశాన్ని ధర్మాసనం ముందు ప్రస్తావించగానే.. జస్టిస్ రఘునందన్ రావు నాట్ బిఫోర్ మీ అనేశారు . .దీంతో మరో బెంచ్ పై విచారణ జరగనుంది.
రఘురామకృష్ణరాజుపై జగన్ వ్యక్తిగతంగా పగ బట్టారని రాజకీయవర్గాలు విశ్లేషిస్తూ ఉంటాయి. మీడియాతో మాట్లాడినందుకు ఆయనపై దేశద్రోహంకేసు పెట్టారని గుర్తు చేస్తున్నారు. మనోభావాల పేరుతో దళితులతో కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తారని.. సీఐడీ డీజీ సునీల్ కుమార్ ఈ విషయంలో రఘురామను టార్గెట్ చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ సంక్రాంతికైనా .. రఘురామ కోర్టుకె్ళ్లి పర్మిషన్లు తెచ్చుకున్నా నర్సాపురంలో అడుగు పెట్టలేరని..వస్తే అరెస్ట్ చేస్తారన్న అభిప్రాయం వైసీపీలోనూ గట్టిగా వినిపిస్తోంది. జగన్ సీఎంగా ఉండగా రఘురామ ఏపీలో అడుగుపెట్టలేరని అంటున్నారు.