రఘురామకృష్ణంరాజు వైసీపీలో స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. తాను పార్టీ లైన్లోనే ఉన్నానంటూ.. సొంత లైన్లో.. శరవేగంగా దూసుకెళ్తున్నారు. విజయసాయిరెడ్డితో సంబంధం లేకుండా.. తనంతట తాను.. చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కేంద్రమంత్రుల వద్దకు వరుసగా వెళ్తున్నారు. ఎందుకెళ్తున్నారో…విజయసాయిరెడ్డికి సమాచారం ఉండటం లేదు. పోనీ రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్లారా.. ? ఏదైనా వినతి పత్రం ఇచ్చారా..? ఆ డీటైల్స్ మీడియాకు చెప్పమని.. సూచనలొచ్చినా.. ఆయన పట్టించుకోవడం లేదు. ఆయన పద్దతిలో ఆయన బీజేపీకి సన్నిహితంగా మెలుగుతున్నారు.
నిన్న రాత్రి అమిత్ షాతో.. రఘురామకృష్ణంరాజు సమావేశమయ్యారు. ఆ తర్వాత పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఈ భేటీలకు తన పార్టీకి సంబంధం లేదనట్లుగా ఆయన వ్యవహరించారు. అంతే కాదు.. వైసీపీ అధినాయకత్వానికి సంబంధం లేకుండా.. బుధవారం.. మరో హైలెట్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. అదే తూర్పు కాపు నేతలతో కలిసి కేంద్రమంత్రి ధావర్ చంద్ గెహ్లాట్‌తో.. సమావేశం కాబోతున్నారు. దీనికి కూడా పార్టీకి సమాచారం ఉందో లేదో క్లారిటీ లేదు. కేంద్ర జాబితాలో తూర్పు కాపులను ఓబీసీల్లో చేర్చాలని.. ఆయన .. తన బృందంతో కలిసి విజ్ఞప్తి చేయనున్నారు.
రఘురామకృష్ణం రాజు.. మొదటి నుంచి… వైసీపీ అగ్రనాయకత్వం ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. దాంతో.. ఆయనను ఓ సారి అమరావతికి పిలిపించి జగన్ హెచ్చరించినట్లుగా చెబుతున్నారు. అయితే రఘురామకృష్ణంరాజు.. జగన్ మాటలను లైట్ తీసుకున్నారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువగా.. బీజేపీ నేతలతో టచ్‌లో ఉంటున్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి కూడా వెళ్లివచ్చారు. ఆ తర్వాత గాడ్సేను పొగిడిన వ్యవహారంలో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌తో క్షమాపణ చెప్పించే విషయంలోనూ.. ఆయన మధ్యవర్తిత్వం చేశారని చెబుతున్నారు. అచ్చంగా బీజేపీ నాయకుడిగా వ్యవహరిస్తూండటంతో.. ఆయనపై ఏ చర్య తీసుకోవాలో.. వైసీపీ అగ్రనాయకత్వానికి కూడా అర్థం కావడం లేదు.