ప్రధానమంత్రి నరేంద్రమోడీ .. రఘురామకృష్ణరాజుకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ప్రధానితో సమావేశం అయి… ఏపీలో తాజా పరిస్థితుల్ని ఆయన వివరించినట్లుగా తెలుస్తోంది. ప్రధానితో భేటీ కోసం అపాయింట్మెంట్ అడిగానని.. ఎదురు చూస్తున్నాననని గత వారం ఏబీఎన్ ఎండీ ఆర్కే ఇంటర్యూలో రఘురామకృష్ణరాజు చెప్పారు. దానికి తగ్గట్లుగానే ఆయనకు మోడీ అపాయింట్మెంట్ లభించింది. ఏపీ ప్రభుత్వ తీరుపై రఘురామరాజు వరుసగా విమర్శలు చేస్తున్నారు.
పాలనలో లోపాలపై రోజూ ప్రెస్మీట్లు పెడుతున్నారు. అదే సమయంలో కేంద్రానికి ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో .. ఆయన ప్రధానిని, హోంమంత్రిని వీలైనన్ని ఎక్కువ సార్లు కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రెండు సార్లు మోడీ, షాలను కలిశారు. ఇటీవల అమిత్ షా… ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు రఘురామరాజు బీజేపీలో చేరుతారన్నట్లుగా పార్టీ నేతలకు సందేశం ఇచ్చారు. దీంతో ఆయనపై వైసీపీ నేతలు కూడా విమర్శిస్తున్నారు. బీజేపీలో చేరేందుకే ఆ పార్టీని కాకా పడుతున్నారని విమర్శించారు.
ఇప్పుడు నేరుగా మోడీతోనే సమావేశం కావడం వైసీపీ నేతలను మరింత ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది. ఇటీవల మోడీతో సమావేశం కోసం వైసీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. షా మాత్రం ఒక్క సారి ఆపాయింట్మెంట్ ఇచ్చారు. వరుసగా రఘురమ చేస్తున్న ఫిర్యాదులపై స్పందిస్తున్న కేంద్రం… మోడీతో భేటీ తర్వాత ఎలాంటి కీలకమైన అడుగులు వేసినా అది రాజకీయంగా కలకలం రేపుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.