నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధాని నరేంద్రమోడీపై తన భక్తిని ఆరాధన స్థాయికి తీసుకు వెళ్తున్నారు. వైసీపీలోఇమడలేనని నిర్ణయించుకున్న ఆయన.. మెల్లగా.. ప్రజాస్వామ్య బద్ధంగానే ఆపార్టీపై విమర్శలు.. పథకాల్లో లోపాలను వెల్లడిస్తూ..దూరం అవుతున్నారు. ఈ క్రమంలో ఆయన పదవి ఊడగొట్టాలని… వైసీపీ ప్రయత్నిస్తోంది. వైసీపీ ప్రయత్నాలకు కౌంటర్‌గా రఘురామకృష్ణంరాజు.. ఈసీతో పాటు.. న్యాయవ్యవస్థను కూడా ఆశ్రయించారు. ఆ రెండే సరిపోవు.. అన్నింటి కన్నా సూపర్ పవర్‌ను ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే.. ఆయన ప్రధాని నరేంద్రమోడీని ఓ రేంజ్లో పొగడటం ప్రారంభించారు. రెండు సార్లు పాటలు రిలీజ్ చేసిన ఆయన.. పలుమార్లు… మోడీ నిర్ణయాలను ప్రశంసిస్తూ లేఖలు రాశారు. తాజాగా.. పత్రికల ఎడిటోరియల్ పేజీల్లో కథనాలు కూడా రాస్తున్నారు.
ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ రోజు.. మోడీ పరాక్రమాన్ని ప్రశంసిస్తూ.. రఘురామకృష్ణంరాజు.. ఓ ఆర్టికల్ రాసేశారు. ఆత్మరక్షణలో చైనా అనే హెడ్ లైన్ పెట్టారు. ఫోటో వేసి మరీ.. రఘురామకృష్ణంరాజు రాశారని.. ఆంధ్రజ్యోతి కూడా గుర్తింపు నిచ్చింది. గల్వాన్ లోయ నుంచి చైనా బలగాలు వెనక్కి తగ్గి.. చైనా వైపు వెళ్లడమే.. ఈ ఆర్టికల్ వెనుక ఉన్న కారణం. అలా బ్రేకింగ్ న్యూస్ రాగానే ఇలా మోడీకి క్రెడిట్ కట్ట బెట్టేసి.. వీరుడు..శూరుడు అని.. రఘురామకృష్ణంరాజు పొడిగేశారు. ఆయన లద్దాఖ్‌లోని నీము ప్రాంతాన్ని సందర్శించి.. చైనాకు వార్నింగ్ ఇచ్చారని.. అది బాగా పని చేసిందని… తన ఆర్టికల్ అర్థంగా.. ఎంపీ చెప్పుకొచ్చారు.
వైసీపీతో తగవులు పెట్టుకోవడం ప్రారంభించినప్పటి నుండి ఆయనకు మీడియాలో విపరీతమైన కవరేజ్ వస్తోంది. టీవీ9, ఎన్టీవీ లాంటి .. ఏపీ అధికార పార్టీకి దగ్గరగా ఉండే చానళ్లు కూడా.. ఈ ఆర్ఆర్ఆర్కు కవరేజ్ ఇస్తున్నాయి. అయితే ఆ చానళ్ల దృక్కోణం వేరు. ఆయనతో వైసీపీకి రాజీ చేయాలని ప్రయత్నం చేశాయి. కానీ.. టీడీపీ మద్దతు చానళ్లు అని ప్రచారం పొందినవి మాత్రం ఆయన మాటలను మరింత వివాదాస్పదం చేసే ప్రయత్నం చేశాయి. ఇప్పుడు.. ఆయన మోడీకి వేస్తున్న పొగడ్తల మాలకూ సహకరిస్తున్నాయి. ఆయన రాజకీయ జీవితం భద్రంగా ఉండేలా… తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి.