నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తన నియోజకవర్గానికి వెళ్ల ఏళ్లు గడిచిపోతోంది. చాలా సార్లు నియోజకవర్గానికి వెళ్లాలనుకున్నారు కానీ పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో ఆగిపోయారు. ఆయన ఎప్పుడు పర్యటన పెట్టుకుంటే.. అప్పుడు ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యేవి. చివరికి ఆయన ఆగిపోయేవారు. ఓ సారి ఆయన నర్సాపురం పర్యటన షెడ్యూల్ ఖరారు చేసుకుని హైదరాబాద్ వచ్చారు. అయితే నర్సాపురం వరకూ రాకుండా హైదరాబాద్ నుంచే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మీడియాతో మాట్లాడటం రాజద్రోహం అని ఆయనపై కేసు లు పెట్టారు.
ఆ తర్వాత నుంచి ఆయన నర్సాపురం వైపు రావాలని అనుకోవడం లేదు. ఈసారి నేరుగా తన నియోజకవర్గానికి ప్రధానమంత్రి వస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఆయన పర్యటనలో ఎంపీ కూడా ఉండాలి. ఎందుకంటే ప్రధాని వస్తున్నది కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం. ఎంపీ నియోజకవర్గంలో ఎంపీ పాల్గొనకపోవడం ప్రోటోకాల్ ఉల్లంఘన అవుతుంది. కానీ వస్తే అరెస్ట్ చేస్తారని రఘురామ ఢిల్లీలో అందరికీ చెప్పుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వంలో పై స్థాయి వరకూ అదే ఆరోపణ తీసుకెళ్తున్నారు. ఇదంతా వ్యూహాత్మకంగా చేస్తున్నారో లేకపోతే.. నిజంగానే భయపడుతున్నారో కానీ ఏపీలో ఓ ఎంపీ తిరగడానికి అనువైన పరిస్థితులు లేవని మాత్రం అందరి దృష్టికి తీసుకెళ్తున్నారు.
ఎంత రెబల్ ఎంపీ అయినా సొంత నియోజకవర్గానికి వస్తే ఏదో ఓ కేసు పెట్టి అరెస్ట్ చేస్తామన్న పరిస్థితులు దేశంలో ఏ ఇతర రాష్ట్రాల్లోనూ ఉండవు. అది ప్రజాస్వామ్యం కాదు. కానీ ఏపీలో ప్రభుత్వ పెద్దలు.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు … ప్రజాస్వామ్య ప్రమాణాలకు అనుగుణంగా లేవు. ఎవర్ని కావాలంటే వారిని ఏదో ఓ కేసు పెట్టి అరెస్ట్ చేయడం కామన్‌గా మారుతోంది. ఇలాంటి పరిస్థితిని .. తననే ఉదాహరణగా చూపించి రఘురామ ఢిల్లీలో అందరి దృష్టికితీసుకెళ్తున్నారు. రఘురామ వస్తే అరెస్ట్ చేస్తామని విజయసాయిరెడ్డి లాంటివాళ్లు ట్విట్టర్ వేదికగా నేరుగా చెబుతూండటాన్ని ఆయన మరింత బలంగా పైస్థాయికి తీసుకెళ్తున్నారు. రఘురామ వ్యవహాత్మకంగానే వ్యవహరిస్తున్నారని.. ఈ విషయం వైసీపీకే అర్థం కావడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.