ఎంపీ రఘురామకృష్ణరాజు జగన్ వ్యాపారాల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. కొత్తగా ఆయన జగన్ మోహన్ రెడ్డికి చెందిన సరస్వతి సిమెంట్స్ కంపెనీకి అక్రమంగా లీజులు కేటాయించారంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. జగన్ సీఎం అయిన తర్వాత సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 50 ఏళ్ల పాటు మైనింగ్, నీటి సరఫరా సౌకర్యానికి సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చారు. ఇవి చట్ట విరుద్దమని.. తప్పుడు సమాచారం ఇచ్చి తీసుకున్నారని.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పిటిషన్లో రఘురామ పేర్కొన్నారు. నిజానికి సరస్వతి కంపెనీ వెనుక ఎన్నో వివాదాలు ఉన్నాయి.
వైఎస్ సీఎం అయిన తర్వాత ఫ్యాక్టరీ నిర్మిస్తామని చెప్పి 950 ఎకరాలు రైతుల వద్ద నుంచి సేకరించారు. ఇంటికో ఉద్యోగం హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ పరిశ్రమ పెట్టలేదు. టీడీపీ హయాంలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఇచ్చిన మైనింగ్ లైసెన్స్, నీటి సరఫరా అనుమతులను రద్దు చేసింది. కానీ జగన్ సర్కార్ వచ్చిన తర్వాత లీజును పునరుద్దరించుకోవడమే కాకుండా యాభై ఏళ్లకు పెంచుకున్నారు. నిజానికి కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకున్నామని సరస్వతి యాజమాన్యం చెబుతోంది. కానీ ఇందు కోసం హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని.. కంపెనీపై సీబీఐ కేసు ఉన్నప్పటికీ.. దాని గురించి చెప్పలేదని.. ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది కూడా సరస్వతి కంపెనీకి అనుకూలంగా వాదనలు వినిపించారని రఘురామ చెబుతున్నారు.
సీబీఐ కేసు నమోదు చేసిన కంపెనీకి లీజు ఎలా పొడిగిస్తారని రఘురామకృష్ణరాజు తన పిటిషన్ లో ప్రశ్నించారు. ఈ లీజులను వెంటనే రద్దు చేయాలని ఆయన హైకోర్టును కోరారు. ఈ కంపెనీ లీజులపై కథనాలు రాసినందుకు మీడియాకు గతంలో నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు రఘురామ నేరుగా కోర్టుకే వెళ్లారు. కానీ రఘురామను ఏం చేయగలరో ఇప్పటికే చేసేశారు..! తాను చేయగలిగింది రఘురమ చేస్తున్నారు.