బ్యాంకులకు రూ. ఎనిమిది వందల కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగ్గొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఆ బ్యాంకులకే క్లాస్ తీసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వానికి బ్యాంకులు అప్పులు ఇచ్చేటప్పుడు వెనుకా ముందూ చూసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. రోజువారీ ప్రెస్మీట్లలో భాగంగా ఏపీ ప్రభుత్వం బ్యాంకుల నుంచి చేస్తున్న అప్పులు.. అందు కోసం చేస్తున్న ప్రయత్నాలపై మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకులు రుణాలిస్తున్నాయని .. తర్వాత ఇబ్బంది పడతారని రఘురామకృష్ణరాజు బ్యాంకర్లను హెచ్చరించారు. నిబంధనలకు విరద్ధంగా రుణాలు ఇస్తే భవిష్యత్లో ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు.
ఏపీ ప్రభుత్వం స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో చేసిన అప్పులు కాకుండా.. తాజా ఎడ్యుకేషన్ కార్పొరేషన్ పేరిట రుణాలకు ప్రయత్నిస్తోందని రఘురామ ఆరోపించారు. ఎయిడెడ్ కళాశాలల ఆస్తులను అమ్ముకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాలు.. కళాశాలలను ప్రభుత్వానికి అప్పగించరాదని, విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. ఎయిడెడ్ కాలేజీల ఆస్తులను స్వాధీనం చేసుకుని ఏపీ ఎడ్యుకేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దాని కింద ఎయిడెడ్ కాలేజీల ఆస్తులను చూపి అప్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రఘురామ ఆరోపించారు. ఈ కాలేజీల ఆస్తులు అమ్మితే ఇంకో లక్ష కోట్లు వస్తాయని, దాంతో మరో ఏడాది పాటు నడిపించవచ్చని అనుకుంటున్నారని సెటైర్లు వేశారు.
రఘురామకృష్ణరాజు రచ్చ బండ ప్రెస్మీట్లు పెడుతున్నారని.. వాటిని ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ.. ఏపీ ప్రభుత్వం వాటి వెనుక కుట్ర ఉందని.. రాజద్రోహం కేసులు పెట్టింది. ఆయనను పుట్టినరోజు నాడే అరెస్ట్ చేసి ధర్డ్ డిగ్రీ ప్రయోగించినా ఆయన వెనక్కి తగ్గడం లేదు. రోజూ ప్రెస్మీట్లు పెట్టి… విమర్శలు చేస్తూనే ఉన్నారు.