బండి సంజయ్‌పై పోలీసుల దాడిని లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ సీరియస్‌గా తీసుకుంది. ఆ ఘటనకు కారణమైన వారందర్నీ పిలిపించి ప్రశ్నించబోతోంది. ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ విషయం తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. అయితే.. బండి సంజయ్ కన్నా ఎక్కువగా ఇబ్బంది పడిన ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మాత్రం లోక్‌సభ ప్రివిలేజ్ కమటీ వేగం చూసి అసంతృప్తికి గురవుతున్నారు. తనపై ఏపీ పోలీసులు చేసిన దాడి గురించి చేసిన ఫిర్యాదులో ఎందుకు ఇంకా స్పందించలేదని ఆయన మథనపడుతున్నారు.
ఈ విషయంలో ప్రజలు సందేహాలు లేవనెత్తుతున్నారని అంటున్నారు. ఈ డౌట్ సామాన్యులకు కూడా వస్తోంది. రఘురామకృష్ణరాజును ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి.. కొట్టారని భావిస్తున్నారు. ఓ ఎంపీని అలా కొట్టడంపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఆయన ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. కానీ బండి సంజయ్ విషయంలో మాత్రం శరవేగంగా చర్యలకు సిద్ధమవుతున్నారు.
అందుకే తనను కొట్టిన వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిజానికి ఆయన వైసీపీకి దూరమైన తర్వాత బీజేపీకే దగ్గరగా ఉంటున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రధానిని.. అమిత్ షాను కలిసి తనను మర్చిపోకుండా చూసుకుంటున్నారు. ఈ కారణమో ఏమో కానీ వైసీపీ ఎంత ప్రయత్నించినా ఆయనపై అనర్హతా వేటు మాత్రం వేయలేదు. కానీ ఆయనను కొట్టిన వారిపై చర్యల్లో మాత్రం అంత వేగం చూపించడం లేదు.