బ్యాంకుల నుంచి రఘురామకృష్ణరాజు ఇండ్ భారత్ తరపున తీసుకున్న రుణాలను రికవరీ చేయాలంటూ విజయసాయిరెడ్డి సీబీఐకి లేఖ రాశారు. ఘనంగా ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. ఆ విషయంలో సీబీఐ చీఫ్ ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆ కేసులన్నీ కోర్టుల్లో ఉన్నాయి. వారే తీర్పు చెప్పాల్సి ఉంది. కానీ రఘురామకు వ్యతిరేకంగా ఏదో చేస్తున్నానన్న అభిప్రాయం కల్పించడానికి విజయసాయిరెడ్డి ఆ లేఖ రాశారు. మరి రఘురామ ఊరుకుంటారా?
ఎంపీ లెటర్ ప్యాడ్ విజయసాయిరెడ్డికే కాదు.. తనకూ ఉందని గుర్తు చేసేందుకు తాను కూడా సీబీఐ చీఫ్‌కు ఓ లేఖ రాశారు. ఇప్పటికి ఆయనపై ఉన్న సీబీఐ కేసుల విషయంలో రాయలేదు. వ్యూహాత్మకంగా వైఎస్ వివేకానందరెడ్డి కేసులో రాశారు. వైఎస్ వివేకా కేసులో… హత్య అని తెలిసినా గుండె పోటు అని చెప్పి అందర్నీ తప్పుదోవ పట్టించేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నించారని… తక్షణం ఆయనను ప్రశ్నించి పూర్తి వివరాలు రాబట్టాలని సీబీఐ చీఫ్‌కు రఘురామ లేఖ రాశారు. లేఖలో విజయసాయిరెడ్డి అనుమానాస్పద స్టేట్మెంట్లు మొత్తాన్ని జత చేశారు.
అయితే విజయసాయిరెడ్డి రాసిన లేఖ లాగే.. రఘురామ రాసిన లేఖను కూడా సీబీఐ చీఫ్ పట్టించుకోరు. ఎందుకంటే ఆయా అంశాలపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోంది. కానీ పోటాపోటీగా వైసపీకి చెందిన ఇద్దరుఎంపీలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుని మీడియాకు విడుదల చేయడం ఆ పార్టీ వర్గాలను సైతం నివ్వెర పరుస్తోంది. విజయసాయిరెడ్డి చేసే చీప్ ట్రిక్కుల వల్ల పరువు పోతోందన్న అభిప్రాయం వారిలో వినిపిస్తోంది.