అసెంబ్లీలో అప్పుడప్పుడూ కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి శుక్రవారం ఒకటి జరిగింది. రఘురామకృష్ణరాజు మంత్రి నిమ్మలను సభకు రావొద్దని రూలింగ్ ఇచ్చారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. స్పీకర్ చెయిర్లో ఉన్న రఘురామ..నీటిపారుదల శాఖకు చెందిన ఓ ప్రశ్నకు సంబంధించి మంత్రిని ఆన్సర్ చేయమన్నారు. మంత్రి నిమ్మల పొడిపొడిగా సమాధానం ఇచ్చి కూర్చున్నారు. రఘురామ వెంటనే తామరాకు మీద నీటి బొట్టులా సమాధానం చెప్పారని సెటైర్ వేశారు.
దీంతో నారా లోకేష్ లేచి నిమ్మల రామానాయుడుకు తీవ్ర జ్వరం ఉన్నా సభ కు వస్తున్నారని రావొద్దని చెప్పినా వినిపించుకోవడం లేదని మీరైనా రూలింగ్ ఇవ్వాలన్నారు. బీజీపీ ఎమ్మెల్యే విష్ణకుమార్ రాజు కూడా అదే చెప్పారు. ప్రజాసేవతో పాటు ఆరోగ్యం కూడ ముఖ్యమేనన్నారు. దీంతో రఘురామ కూడా నిమ్మలకు అనారోగ్యమని తనకు తెలియదన్నారు. వెంటనే.. జ్వరం తగ్గేవరకు అసెంబ్లీకి రావద్దు. ఇది నా రూలింగ్ అని డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నరఘురామ తేల్చేశారు.
నిమ్మల రామానాయుడు పని రాక్షసుడని అందరూ అంటారు. ఆయన ఎప్పుడూ ఏదో ఓ పని పెట్టుకుంటూనే ఉంటారు. నియోజకవర్గంలో ఉంటే సైకిల్ మీద మొత్తం తిరిగేస్తూ ఉంటారు. ఇక కీలకమైన నీటిపారుదల శాఖకు మంత్రి కావడంతో ఆయనకు తీరిక ఉండటం లేదు. అనారోగ్యం ఉన్నా లెక్క చేయడం లేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ రూలింగ్ ఇవ్వాల్సి వచ్చింది.