ఆంధ్రా కాంగ్రెస్ పార్టీలో కొంత కదలిక వస్తోందనే చెప్పొచ్చు! నిజానికి, రాష్ట్ర సమస్యలపై నాయకులు ఈ మధ్యనే కొంత యాక్టివ్ గా కనిపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయమై ఇటీవలే మహా పాదయాత్ర చేశారు. బహిరంగ సభ పెట్టి, పోలవరం నిర్మాణ బాధ్యతల్ని కేంద్రమే తీసుకోవాలనీ, కాంగ్రెస్ హయాంలోనే పోలవరం పనులు చురుగ్గా సాగాయంటూ తమ వంతు ఘనతను గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అయితే, ఈ అంశాన్ని ఇక్కడితో వదలకుండా.. జాతీయ స్థాయిలో కూడా భాజపాపై కొంత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకున్నారు. పోలవరంతోపాటు ఆంధ్రాకు సంబంధించిన కొన్ని అంశాలను రాహుల్ దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం.
పోలవరం ప్రాజెక్టుతోపాటు విభజన చట్టంలోని హామీల విషయమై లోక్ సభలో కాంగ్రెస్ సభ్యులు లేనెత్తే అంశమై రఘువీరా చర్చించారని సమాచారం. ఈ భేటీలోనే లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేకి రాహుల్ ఫోన్ చేశారనీ, ఆంధ్రాకు సంబంధించిన అంశాలను సభలో ప్రస్థావించాల్సిన విషయమై దృష్టి సారించమని చెప్పినట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలనే డిమాండ్ ను ప్రముఖంగా వినిపించాలని రఘువీరా కోరినట్టు సమాచారం. ఇదే భేటీలో… రాష్ట్రానికి రాహుల్ ను రావాల్సిందిగా రఘువీరా ఆహ్వానించారట! గతంతో పోల్చితే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడుతోందనీ, ఈ సమయంలో రాహుల్ రాష్ట్రానికి వస్తే కేడర్ కు కొంత ఉత్సాహం వస్తుందని రఘువీరా కోరినట్టు సమాచారం. దీనిపై రాహుల్ ఎలాంటి స్పష్టమైన ప్రకటనా చేయలేదట.
రఘువీరాను పీసీసీ బాధ్యతల నుంచి మారుస్తారనే అభిప్రాయం ఈ మధ్య వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాహుల్ ను ఆయన కలుసుకున్నారని కూడా కొంతమంది అంటున్నారు. అయితే, రాష్ట్రంలో పరిస్థితులు కాంగ్రెస్ సానుకూలంగా మారుతున్నాయని రఘువీరా చెప్పినా.. వాస్తవాలు రాహుల్ కి కూడా తెలుసు కదా. రాష్ట్రంలో పరిస్థితి కొంత మెరుగుపడిందని నమ్మకం కుదిరిన తరువాతే ఆయన ఆంధ్రా పర్యటనకు వస్తారని ఆ పార్టీ నేతలే ఆఫ్ ద రికార్డ్ అభిప్రాయపడుతున్నారు. నిజానికి, ఏపీ పీసీసీ పదవి మార్పు అంశంపై కర్ణాటక ఎన్నికల తరువాత ఓ నిర్ణయం కచ్చితంగా ఉంటుందనే అనుకోవచ్చు. అందుకే, ఈలోగా తమ ప్రొగ్రెస్ రిపోర్టును ఎప్పటికప్పుడు రాహుల్ ముందు ఉంచుతూ, తన పదవిని మరోసారి కాపాడుకోవడమే ఈ భేటీ వెనక రఘువీరా వ్యూహం అనే వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీ పీసీసీ మార్పు అనే అంశాన్ని పక్కనపెడితే.. విభజన హామీలపై కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని రాహుల్ ప్రయత్నించడం అనేది ఈ భేటీలో ప్రాధాన్యతాంశంగానే చెప్పుకోవాలి.