తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తొలగిస్తారని క్లారిటీ రావడంతో ఇప్పటి వరకూ ఆయనపై వ్యతిరేకతతో ఉగ్గబట్టుకున్న వారంతా ఒక్క సారిగా తమ కోపన్నా వెళ్లగక్కుతున్నారు. ముందుగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బహిరంగ విమర్శలతో మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. బండి సంజయ్ పుస్తెలు తాకట్టు పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారని కానీ ఇప్పుడు ఏకంగా రూ. వంద కోట్లు పెట్టి పేపర్ ప్రకటనలు ఇస్తున్నారని ఆ సొమ్మంతా ఎక్కడిదని ప్రశ్నించారు. పేపర్ ప్రకటనల్లో తమలాంటి నేతల ఫోటోలనూ కనిపించనీయడం లేదన్నారు.
పార్టీలో అధ్యక్ష పదవి పై రఘునందన్ రావు కూడా ఆశలు పెట్టుకున్నట్లుగా మాట్లాడుతున్నారు. అధ్యక్ష పదవి ఇవ్వడానికి తనకేం తక్కువ అనిప్రశ్నించారు. కేసీఆర్ ను మట్టి కరిపిస్తానన్న కారణంగానే తనను చూసే దుబ్బాకలో ప్రజలు ఓట్లు వేశారన్నారు. దుబ్బాక ఎన్నికల్లో తనకు ఎవరూ సాయం చేయలేదన్నారు. మునుగోడులో రూ వంద కోట్లు ఖర్చు పెట్టారని.. అదే వంద కోట్లు తనకు ఇస్తే తెలంగాణను దున్నేసేవాడినని చెప్పుకొచ్చారు. పదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నానని.. ఆ పని చేసిన దానికి కూలీ ఇవ్వమని అడుగుతున్నానని ఆయన చెబుతున్నారు.
రఘునందన్ రావు బీజేపీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు. ఆయన పార్టీ శాసనసభాపక్ష నేత పదవి కోరుతున్నారు. రాజాసింగ్ ను సస్పెండ్ చేశారు. ఇంకా సస్పెన్షన్ ఎత్తేయలేదు. మరో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఉన్నారు. అయితే బీజేపీ శాసనసభాపక్ష పదవి అనేదే లేకుండా నెట్టుకొస్తున్నారు. దీనిపై గతంలో రఘునందన్ రావు అసంతృప్తి వ్యక్తం చేసినా… పట్టించుకోలేదు. ఇప్పుడు సమయం చూసి రఘునందన్ రావు.. రాజకీయం చేస్తున్నారు.