వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి రాజ్యసభ సీటు కేటాయించడంపై అప్పుడే తెదేపా నేతలు విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. “జగన్ అక్రమాస్తుల కేసులలో సిబిఐ దాఖలు చేసిన 11 చార్జ్ షీట్లలో కూడా ఏ-2 ముద్దాయిగా ఉన్న విజయసాయి రెడ్డి వంటి ఒక ఆర్ధిక నేరస్థుడుని వైకాపా తరపున రాజ్యసభకి పంపించడం చాలా శోచనీయం. వైకాపాలో అగ్రవర్ణాలకి చెందిన వ్యక్తులకి మాత్రమే అధికారం, పదవులు ఇస్తారని జగన్ మరోసారి నిరూపించారు. ఒకప్పుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి అగ్రవర్ణాల నేతలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పద్దతి అనుసరిస్తున్నారు. అందుకే వైకాపాలో నిరాదరణకి గురవుతున్న మిగిలిన కులాలకు చెందిన ఎమ్మెల్యేలు తమ వంటివారిని అక్కున చేర్చుకొని ఆదరిస్తున్న తెదేపాలోకి తరలివస్తున్నారు,” అని మంత్రి పల్లె రఘునాధ రెడ్డి అన్నారు.
విజయసాయి రెడ్డిని రాజ్యసభ అభ్యర్ధిగా జగన్ ప్రకటించిన తరువాత ఒక ప్రముఖ వెబ్ సైట్ లో వైకాపా తీరుని క్లుప్తంగా వివరిస్తూ “బై రెడ్డి, ఫర్ రెడ్డి, టు రెడ్డి” అనే వ్యాఖ్య కనిపించింది. అది నూటికి నూరుపాళ్ళు నిజమని ఆ పార్టీని చూస్తే అర్ధమవుతుంది. వచ్చే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలని జగన్ కలలు కంటున్నప్పుడు, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సమానంగా ఆదరించడం చాలా అవసరం. అలాకాక ఒకే వర్గానికి, కులానికి ప్రాధాన్యతనిస్తే వారి ఓట్లతోనే అధికారంలోకి రావడం అసంభవమని గ్రహిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విజయసాయి రెడ్డిని రాజ్యసభ అభ్యర్ధిగా ప్రకటిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా అక్రమాస్తుల కేసుల ప్రస్తావన చేయడం గమనార్హం. ఆ కేసులలో ఆయనపై ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ ఆయన లొంగిపోకుండా నిజాయితీగా నిలబడ్డారని అందుకే ఆయనకి సీటు కేటాయిస్తున్నానని చెప్పుకొన్నారు. ‘ఒత్తిళ్లకు లొంగకుండా నిజాయితీగా నిలబడటం’ అంటే అప్రూవర్ గా మారకుండా ఉండటమనుకోవాలేమో? ఆవిధంగా చెప్పుకోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా ఉన్నందుకే ఆయనకి పార్టీలో ఉన్నత పదవి, ఇప్పుడు రాజ్యసభ సీటు కేటాయిస్తున్నట్లు చెప్పుకొంటున్నట్లుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పెద్దల సభగా పిలువబడే రాజ్యసభలో వివిధ రంగాలలో నిష్ణాతులు, గౌరవనీయులు, నిష్కళంక చరిత్రగల వ్యక్తులు ఉంటారని ప్రజలు ఆశిస్తుంటే విజయ మాల్యా, విజయసాయి రెడ్డి వంటి వాళ్ళు అక్కడ చేరుతున్నారు. అందుకు దేశ ప్రజలు సంతోషించాలో, బాధపడాలో?