వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఈగ వాలినా సహించలేకపోతున్న గాసిప్ సైట్‌కు.. ఆ పార్టీ ఎంపీ నుంచే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. తన వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా కథనాలు రాస్తున్నారంటూ.. గాసిప్ సైట్‌పై.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. నేరుగా లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు. లోక్‌సభ స్పీకర్ దీనిపై విచారణ జరిపి.. నిజంగానే తమ సభ్యుడిని వెబ్సైట్ కించ పరిచినట్లు భావిస్తే.. ఏ చర్యలైనా తీసుకోవడానికి అధికారం ఉంది. లోక్‌సభ స్పీకర్ తీసుకునే చర్యలను సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించడానికి అవకాశం లేదు. అందుకే.. రఘురామకృష్ణంరాజు.. నేరుగా లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసినట్లుగా చెబుతున్నారు. సభ్యుల ప్రివిలేజ్‌కు ఇబ్బంది ఎదురైతే స్పీకర్లు కూడా.. చూస్తూ ఊరుకోరు కాబట్టి…ఈ విషయంలో ఏదో ఓ నిర్ణయాన్ని స్పీకర్ తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. అది వేరే విషయం.
వైసీపీ .. ఆ పార్టీ నేతలు ఏం చేసినా… అపురూపంగా చెప్పుకునే గాసిప్ సైట్.. రఘురామకృష్ణంరాజుపైన మాత్రమే ఎందుకు వ్యతిరేక ప్రచారం చేస్తోందనేది.. హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ కావాలనే ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని.. సస్పెండ్ చేయించుకుని బీజేపీలో చేరిపోవాలనుకుంటున్నారని.. టీడీపీ అనుకూల మీడియాతోనే పదే పదే మాట్లాడుతున్నారని.. జగన్ నుంచి.. ఏదో ఆశించి అది రాకపోయే సరికి.. ఇలా ఒత్తిడి చేస్తున్నారని రకరకాలుగా ఆ సైట్ ప్రచారం చేస్తోంది. వరుసగా కథనాలు రాయిస్తోంది. దీంతో వైసీపీ ఎంపీకి మండిపోయింది.
కొసమెరుపేమిటంటే.. ఆ గాసిప్ సైట్.. తన బ్రాండ్ గాసిప్స్‌తోనే .. వైసీపీ ఎంపీపై ప్రచారం చేసింది. ఎక్కడా రఘురామకృష్ణంరాజు పేరు చెప్పలేదు. కానీ.. ఆయనే అని తెలిసిపోయేలా… ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా.. గాసిప్పుల్లాగే వాటిని రాసింది. వీటిని చూసి.. రఘురామకృష్ణంరాజుకు మండిపోయింది. వెంటనే.. లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.