వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా తనను అరెస్ట్ చేయించాలని అనుకుంటున్నారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అనుమానిస్తున్నారు. ప్రతీ రోజూ రచ్చ బండ పేరుతో ప్రెస్‌మీట్ పెట్టే ఆయన .. ఈ సారి ఓ వీడియో రిలీజ్ చేశారు. సీఎం జగన్‌కు అన్నీ తానై వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ అనే అధికారి.. కేంద్ర ఆర్థిక శాఖలో ఉన్న తన బ్యాచ్‌మేట్ సాయంతో తనపై కేసు పెట్టించారని.. ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చేశారని ఆరోపించారు. తనను అరెస్ట్ చేయించేవరకూ జగన్ అన్నం తినేలా లేడని సెటైర్ వేశారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకే ప్రవీణ్ ప్రకాష్‌ని పెట్టుకున్నారని మండిపడ్డారు. అయితే ఆయన రక్షకుడికా కాకుండా జగన్‌కు తక్షకుడిగా మారారని విమర్శించారు.
రఘురామకృష్ణరాజుపై గత వారం సీబీఐ కేసు నమోదయింది. జగన్మోహన్ రెడ్డితో ప్రధానమంత్రి భేటీ అయిన రోజునే.. ఆయనపై సీబీఐ కేసు నమోదయింది. అదే రోజు.. రఘురామకృష్ణరాజు రుణం తీసుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉన్నతాధికారుల్ని జగన్ పిలిపించుకుని మాట్లాడారు. ఈ పరిణామాల నేపధ్యంలో… ఎన్సీఎల్టీలో ఉన్న కేసు విషయంలోనూ సీబీఐ కేసు నమోదు చేసింది. సోదాలు చేసినట్లుగా ప్రచారం జరిగింది కానీ.. తన ఇళ్లు, ఆఫీసుల్లో ఎక్కడా సోదాలు జరగలేదని రఘురామకృష్ణరాజు ప్రకటించారు. అయితే కేసు నమోదయిందని మాత్రం అంగీకరించారు. అరెస్ట్ చేస్తారో లేదో కానీ.. జగన్మోహన్ రెడ్డి లక్ష్యం మాత్రం అదేనని చెప్పడం ప్రారంభించారు.
కేవీపీ వియ్యంకుడైన రఘురామకృష్ణరాజు రాజకీయ రంగ ప్రవేశం వైసీపీతోనే జరిగింది. కానీ తర్వాత ఆయన జగన్ తీరుతో మనస్తాపం చెంది బయటకు వచ్చారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. మళ్లీ టీడీపీలో చేరారు. గత ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ రాయబారంతో మళ్లీ వైసీపీలో చేరారు. అయితే గెలిచిన కొంత కాలానికే జగన్ తీరుతో అసంతృప్తికి గురయ్యారు. ఆ పార్టీపై తిరుగుబాటు చేశారు. అయితే జగన్ ఆయనను వదిలి పెట్టాలనుకోవడం లేదు. అనర్హతా వేటు వేయించడం దగ్గర్నుంచి అరెస్ట్ చేయించడం వరకూ అన్ని రకాలుగా కక్ష సాధింపు కోసం ప్రయత్నిస్తున్నారన్న విమర్శలను రఘురామకృష్ణరాజు చేస్తున్నారు.