గోవులు.. గోశాలల అంశాలు తమకు పేటెంట్ లాంటివని.. భారతీయ జనతా పార్టీ నేతలు భావిస్తూ ఉంటారు. అయితే.. ఏపీలో మాత్రం.. బీజేపీ నేతల కన్నా చురుగ్గా.. అలాంటి అంశాలపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందిస్తున్నారు. గత వారం.. సింహాచలం ఆలయానికి సంబంధించిన గోశాలలో గోవులు మృత్యువాత పడ్డాయి. ఈ విషయంపై కలకలం రేపింది. దీంతో.. ముఖ్యమంత్రి జగన్‌కు తాను రాస్తున్న లేఖల ఎపిసోడ్లలో.. ఈ అంశానికి ఓ లేఖ కేటాయించారు. రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎంజగన్‌కు లేఖ పంపారు.
రఘురామకృష్ణరాజు.. ముఖ్యమంత్రికి లేఖలు రాస్తే ఆషామాషీగా రాయరు. తాను రాస్తున్న అంశానికి సంబంధించిన పూర్వాపరాలన్నింటినీ సేకరిస్తారు. అందులో వైఎస్ హయంలో తీసుకున్న నిర్ణయాలు ఏమైనా ఉంటే వాటిని ప్రముఖంగా ప్రస్తావిస్తారు. గతంలో రాసిన లేఖల్లోనూ అదే ఉంది. తాజాగా గోశాలల అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయాలని రాసిన లేఖలోనూ.. వైఎస్ కాలం నాటి నిర్ణయాల ప్రస్తావన ఉంది. వైఎస్. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గోశాలల ఏర్పాటుకు కమిటీల ఏర్పాటుకు జీవో ఇచ్చారని .. అయితే ఆ తర్వాత దాన్ని పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు.. మళ్లీ వైఎస్ ఇచ్చిన జీవో ప్రకారం.. కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు.
సింహాచలంలో మూడు ఆవులు చనిపోవడాన్ని.. .. గత ఏడాది తాడేపల్లి గోశాలలో విషప్రయోగం వల్ల 100 ఆవులు మరణించిన ఘటనలను ఎంపీ తన లేఖలో ప్రస్తావించారు. అన్ని వర్గాలతో కలిసి గోశాల అభివృద్ధి కమిటీలు వేయాలని కోరారు. భారతీయ జనతా పార్టీకి దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తున్న రఘురామకృష్ణరాజు.. టీటీడీ భూముల అంశంపై అగ్రెసివ్‌గా స్పందించించి.. హైకమాండ్‌కు ఆగ్రహం తెప్పించారు. ఇప్పుడు కొత్తగా గోవుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. అయితే.. రఘురామకృష్ణరాజు రాసే లేఖలకు.. వైసీపీ సమాధానం ఇవ్వడం మానేసింది.