ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది. జిల్లాకు చెందిన నేతలు తమ కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వాలని కోరినా వాటిని కాదని రామసహాయంను అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన గురించి పెద్ద చర్చే మొదలైంది.
టాలీవుడ్ హీరో వెంకటేశ్ పెద్ద కుమార్తె అశ్రితను రఘురామ్ పెద్ద కొడుకు వినాయక్ రెడ్డి పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి 2019లో జైపూర్లో ఘనంగా జరిగింది. అశ్రిత ఇన్ఫినిటీ ప్లేటర్ అనే బేకరీ చైన్ సంస్థను నిర్వహిస్తూ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో యాక్టివ్ గా ఉంటారు. ప్రస్తుతం ఆ దంపతులు స్పెయిన్లో ఉంటున్నట్టుగా తెలుస్తోంది. రఘురామ్ రెడ్డి చిన్న కొడుకు అర్జున్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు స్వప్ని రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు.
మొదట తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని హైకమాండ్ ను కోరారు పొంగులేటి. అధిష్టానం అందుకు నిరాకరించడంతో తనదైన శైలిలో చక్రం తిప్పిన పొంగులేటి తన సోదరుడికి కాకపోయినా వియ్యంకుడికి టికెట్ ఇప్పించుకోవడంలో సఫలీకృతమయ్యారు.
1961, డిసెంబర్ 19న రామసహాయం సురేందర్ రెడ్డి,జయమాల దంపతులకు జన్మించిన రామసహాయం రఘురాంరెడ్డి స్వగ్రామం పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని చేగొమ్మ.రామసహాయం రఘురాం రెడ్డి తండ్రికి బలమైన రాజకీయ నేపథ్యమే ఉంది.ఆయన పీవీ నరసింహారావుకు అత్యంత సన్నిహితుడు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది.పాలన అనుభవం ఉన్న రామసహాయం కుటుంబంలో మరో రాజకీయ నాయకుడు రాలేదు. తాజాగా ఆయన కొడుకు రామసహాయం రఘురామ్ రెడ్డి ఖమ్మం పార్లమెంట్ బరిలో దిగుతున్నారు.