రఘురామకృష్ణరాజు బెయిల్ రద్దయ్యేలా చేసుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాలను ఆయన పట్టించుకోవడం లేదు. హైదరాబాద్లో విచారణ చేసుకోవచ్చని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సీఐడీ అధికారులు ఆయనకు నోటీసులిచ్చారు. సోమవారం హైదరాబాద్ దిల్ కుషా గెస్ట్ హౌస్కురావాలని చెప్పారు. రఘురామ విచారణకు హాజరవుతారన్న ఉద్దేశంతో సీఐడీ అధికారుల బృందం ఏపీ నుంచి హైదరాబాద్కు వచ్చింది. ముగ్గురు మధ్యవర్తుల సమక్షంలో విచారించాలని హైకోర్టు ఆదేశించడంతో తెలంగామకు చెందిన డిప్యూటీ తహసీల్దార్, వైద్యుడు, మరో మధ్యవర్తిని కూడా ఏపీ సీఐడీ పోలీసులు సిద్ధం చేశారు.
రఘురామ తరపున కూడా కొంత మంది వచ్చారు. రఘురామకు గుండెకు సంబంధించిన సమస్య ఉండటంతో ఆయన తరపున ఓ వైద్యుడు కూడా వచ్చారు. అయితే చివరికి తాను రావడం లేదని రఘురామ సమాచారం ఇచ్చారు. అయితే అదే సమయంలో ఢిల్లీలో తనకు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయాన్ని ధృవీకరించిన ఎంపీ.. నోటీసులకు సమాధానం ఇచ్చానని తెలిపారు. ఈ నెల 16 వ తేదీనే సమాధానం ఇచ్చానని, మరోసారి విచారణకు హాజరుకావాల్సిన అవసరం తనకు కనిపించలేదన్నారు.
హైదరాబాద్లో విచారణకు తనతో పాటు రెండు వార్తా చానళ్లకు కూడా నోటీసులు ఇవ్వాలని కోర్టు చెప్పిందని.. తనకు ఒక్కడికే నోటీసు ఇవ్వడం కోర్టు ధిక్కరణ అవుతుందని చెప్పారు. మరి ఆయన రానని చెబితే సీఐడీ అధికారులు హైదరాబాద్ ఎందుకు వచ్చారన్నది సందేహంగా మారింది. ఆయన బెయల్ షరతులు ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లడానికే సీఐడీ అధికారులు ఇలా చేశారని.. ఆయన బెయిల్ రద్దు చేయాలని వారు ఈ కారణంగా చూపి హైకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.