వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తన నియోజకవర్గం నర్సాపురం వెళ్తే దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు. అందుకే ఆయన ఉంటే ఢిల్లీ లేకపోతే హైదరాబాద్నే ఎంచుకుంటున్నారు. కానీ నర్సాపురం మాత్రం వెళ్లడం లేదు. ఈ వారం ఆయన నర్సాపురం వెళ్లాలని అనుకున్నారు. కానీ ఆయన వెళ్లడానికి ముందే ఆయనపై కేసులు నమోదైనట్లుగా ఆయనకు సమాచరం వచ్చింది. మత పరమైన కేసులు పెట్టి.. కొంత మంది వైసీపీ దళితులతో ఆందోళనలు చేయించి… తనను అరెస్ట్ చేయించాలనుకుంటున్నారని.. దీనికి వైవీ సుబ్బారెడ్డి, మంత్రి రంగనాథ రాజు కలిసి ప్లాన్ చేశారని ఆయన ఆరోపిస్తున్నారు.
విచిత్రంగా ఆయన నర్సాపురం రాకపోయినప్పటికీ.. కొంత మంది దళిత సంఘాల పేరుతో… పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయించారు. గో బ్యాక్ రఘురామకృష్ణంరాజు నినాదాలు చేయించారు. ఢిల్లీలోనే ఉన్న రఘురామకృష్ణంరాజు తనపై కుట్రలు జరుగుతున్నాయనడానికి ఇదే సాక్ష్యామని.. లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. డీజీపీపైనా ఆయన ఫిర్యాదు చేశారు. కొంత మంది ప్రభుత్వ పెద్దలపైనా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్పీకర్ సెక్రటేరియట్ కేంద్ర హోంశాఖకు పంపింది. విచారించి 14 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించిది. నివేదికను రఘురామకృష్ణరాజుకు కూడా పంపాలని సూచించింది.
అయితే కేంద్ర హోంశాఖ నేరుగా దర్యాప్తు చేయదు. దాన్ని రాష్ట్రానికే పంపే అవకాశం ఉంది. ఇక్కడ అలాంటిదేమీ లేదని నివేదిక వెళ్తుంది. అయితే.. కేంద్ర హోంశాఖతో నేరుగా దర్యాప్తు చేయించాలన్న ఉద్దేశంతో రఘురామకృష్ణంరాజు ఉన్నారు. అయితే కేంద్రంలో ఆయన పలుకుబడి కన్నా… వైసీపీ పలుకుబడి ఎక్కువే ఉంది కాబట్టి అది సాధ్యం కాదన్న చర్చ వైసీపీలో జరుగుతోంది.