ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనదైన ముద్ర వేసేందుకు రఘురామకృష్ణరాజు కొత్త ప్రయత్నం చేస్తున్నారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా అభివృద్ధి చేసేందుకు ఆయన చేస్తున్న ప్రత్యేక ప్రయత్నంతో.. చాలా మంది స్పందిస్తున్నారు. ఆయన మిత్రులు.. సినీ ఇండస్ట్రీలోని వారు కూడా స్పందిస్తున్నారు. అశ్వనీదత్ ఐదు లక్షలు, రావు రమేష్ మూడు లక్షలు ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో ప్రకటించారు. నిజానికి ఆయన ఫండ్ ప్రకటించిన రెండు రోజుల్లోనే రూ. కోటి మొత్తం అందినట్లుగా చెప్పారు.
ఈ క్రౌడ్ ఫండింగ్ తో ఉండి నియోజకవర్గంలో ప్రధానంగా డ్రైనేజీ సమస్యపై దృష్టి సారించారు. ఇప్పటికే కాలువల పూడిక తీత పనులు ప్రారంభించారు. చాలా చోట్ల డ్రైనేజీ క్లియరెన్స్ చేస్తున్నారు. తర్వాత పూర్తి స్థాయి పనులు చేపట్టనున్నారు. నియోజకవర్గం మొత్తం ఈ పనులు చేపట్టడానికి చాలా ఖర్చవుతుంది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చేవి కొంతే. అయితే.. ప్రభుత్వానికి ఈ పబ్లిక్ పార్టిసిపేషన్ గురించి చెబితే వేగంగా ఇతర నిధులు మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది.
రఘురామరాజు ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టడం లేదు. ఆయన పూర్తిగా నియోజకవర్గంపైనే దృష్టిపెట్టారు. వైసీపీ హయాంలో ఐదేళ్లు ఎంపీగా ఉన్నా కనీసం సొంత నియోజకవర్గంలో పర్యటించలేకపోయారు. ఇప్పుడా పరిస్థితి లేదు. మంత్రి పదవులు.. స్పీకర్ లాంటి పదవి ఆశించినా ప్రయోజనం లేకపోయింది . నిరాశపడినా వెంటనే రంగలోకి దిగి నియోజకవర్గంపై తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు.