ఎంపీ రఘురామరాజు సైలెంట్‌గా ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారు. డిశ్చార్జ్ అవడానికి నాలుగు రోజుల సమయం పడుతుందని రఘురామ తరపు న్యాయవాదులు మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే రెండు రోజుల్లోనే ఆయన ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయితే… బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిపోయారు. రఘురామరాజు ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి బయటకు రాగానే మరోసారి అదుపులోకి తీసుకోవాలని.. గుంటూరు అర్బన్ పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లుగానే కనిపిస్తోంది.
అర్బన్ ఎస్పీకి రఘురామ తరపు న్యాయవాదులు కోర్టు ధిక్కార నోటీసులు పంపించడంతో.. ఆయనను గుంటూరు తీసుకు వచ్చేందుకు పంపిన ప్రత్యేక బృందాలను వెనక్కి పిలిపించినట్లుగా తెలుస్తోంది. దీంతో హైదరాబాద్‌లో ఉంటే.. ఏపీ పోలీసులు ఏదో ఓ కేసు పెట్టి మళ్లీ అరెస్ట్ చేయడానికి వచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ప్రణాళిక ప్రకారం.. డిశ్చార్జ్‌ను రెండు రోజుల పాటు వాయిదా వేసుకున్న రఘురామ… ఈ లోపు ఢిల్లీకి ప్రత్యేక చార్టర్డ్ విమానం మాట్లాడుకున్నారు. అంతా రెడీ అయిన తర్వాత డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారు.
సుప్రీంకోర్టులో బెయిల్ ఇచ్చిన తర్వాత … డిశ్చార్జ్ సమ్మరీని గుంటూరు సీఐడీ కోర్టులో సమర్పిస్తే.. బెయిల్ ఉత్తర్వులు వస్తాయి. కానీ.. సుప్రీంకోర్టు తీర్పులో విడుదలైన పది రోజుల్లోపు ష్యూరిటీ పత్రాలు సమర్పించవచ్చని ఉందని రఘురామ తరపులాయర్లు చెబుతున్నారు. దీంతో ఆయన డిశ్చార్జ్ సులువు అయిందని.. డిశ్చార్జ్ సమ్మరీని వెంటనే కోర్టులో సబ్మిట్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా రఘురామను మళ్లీ అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. వ్యూహాత్మకంగా రఘురామరాజు తన లాయర్ల ద్వారా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి.. తాను ఢిల్లీ వెళ్లిపోయారు.