కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామాలు వేగంగా సాగుతున్నాయి. జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చిన రఘురామకృష్ణరాజు నిందితుడ్ని గుర్తించే పరేడ్ లో న్యాయమూర్తి ముందు నిందితుడ్ని గుర్తించారు. సీఐడీ అదుపులోకి తీసుకున్నప్పుడు తనపై కూర్చుని ఫోన్ ఆన్ చేయాలని టార్చర్ చేశాడని ఆ సమయంలో ముఖానికి కట్టుకున్న కర్చీఫ్ ఊడిపోయిందన్నారు. తాను ఓ సారి చూశారని ఇప్పుడు గుర్తించానని రఘురామ కృష్ణరాజు తెలిపారు. న్యాయమూర్తి ముందు తులసిబాబును గుర్తించినట్లుగా ఆయన చెబుతున్నారు.
తులసీబాబు టీడీపీలో లేరని ఆయనకు టీడీపీ సభ్యత్వం లేదని తెలిసిందని రఘురామ తెలిపారు. గుడివాడలో టీడీపీని గెలిపించారని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తనను అరెస్టు చేయక ముందే మెడికల్ టీంను ఏర్పాటు చేయాలని అప్పటి గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారని ఆయనను కూడా ఈ కేసులో చేర్చాలని రఘురామ అంటున్నారు. ఆయనకు ఎవరు ఆదేశాలు ఇచ్చారో కనిపెట్టాలన్నారు.
కేసులు నమోదైతే ప్రభుత్వ ఉద్యోగిని ముందుగా సస్పెండ్ చేస్తారని కానీ ఈ కేసులో పలువురిని ఇంకా సస్పెండ్ చేయలేదని రఘురామ అంటున్నారు. తప్పుడు వైద్య నివేదిక ఇచ్చిన అప్పటి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ పరారీలో ఉన్నట్లుగా తెలిసిందన్నారు. ఈ కేసులో ఏ వన్, ఏ టు, ఏ త్రీ ఎందుకు స్పందించడం లేదని రఘురామ ప్రశ్నించారు.