ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తాము కోర్టు కన్నా ఎక్కువ అధికారాలు ఉన్నాయని అనుకుంటున్నట్లుగా ఉంది. తక్షణం… రఘురామకృష్ణరాజును జైలు నుంచి రమేష్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా… సీఐడీ అధికారులు పట్టించుకోలేదు. రఘురామకృష్ణరాజును ఓ రోజైనా జైల్లో పెట్టాలన్న కసి వారికి ఉందేమో కానీ రాత్రంతా జైల్లోనే ఉంచేశారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంం… ఉల్లంఘనకు పాల్పడటం.. ఇప్పుడు.. న్యాయవాద వర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతోంది. తమకు ఉత్తర్వులు అందలేదనో.. మరో కారణమో కోర్టుకు చెబుతారని.. కానీ కోర్టు ఎలా దీన్ని అంగీకరిస్తుందన్న ప్రశ్న వినిపిస్తున్నాయి.
నిజానికి సీఐడీ కోర్టు ఇచ్చినఆదేశాలను సైతం సీఐడీ అధికారులు నిర్మోహమాటంగా ఉల్లంఘించారు. రెండు చోట్ల వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశిస్తే…కావాలని సమయం ఆలస్యం చేసినట్లుగా చేసి.. సాయంత్రానికి జీజీహెచ్లో మాత్రమే పరీక్షలు చేసి.. ఆ నివేదిక కోర్టుకు కూడా సమర్పించక ముందే జైలుకు తరలించారు. సీఐడీ వ్యవహరిస్తున్న విధానం .. ఓ ఎంపీగా.. పౌరునిగా… రఘురామకృష్ణరాజుకు ఉన్న రాజ్యాంగ హక్కులన్నింటినీ హరిస్తున్నట్లుగా ఉందన్న విమర్శలు వస్తున్నా.. సీఐడీ అధికారులు వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో… కేసులో ఫిర్యాదు దారుడుగా…సీఐడీ అదనపు డీజీ ఉన్నారు. సుమోటోగా రఘురామకృష్ణరాజుపై సీఐడీ కేసు పెట్టింది. అలాంటి సమయంలో.. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో సీఐడీ అదనపు డీజీ… రఘురామకృష్ణరాజు వద్దకు వెళ్లారు. అక్కడేం జరిగిందో తెలియాల్సి ఉంది.
రమేష్ ఆస్పత్రికి తరలించి.. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తే… ఏదో బయటపడుతుందన్న భయంతో సీఐడీ అధికారులు… పంపించడం లేదన్న అభిప్రాయాలు.. ఎంపీ కుటుంబసభ్యులు వినిపిస్తున్నాయి. సీఐడీ అధికారులు కొట్టడం వల్లనే… ఆయన కాళ్లు వాచాయని.. అసలు సొరియాసిస్ అనే వ్యాధే.. రఘురామకృష్ణరాజుకు లేదని.. రాత్రికి రాత్రి ఎలా వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా రఘురామకృష్ణరాజు విషయంలో సీఐడీ అధికారులు అన్ని రకాల చట్టాలను ఉల్లంఘించారు. చివరికి కోర్టు తీర్పును కూడా పట్టించుకోలేదు. ఈ పరిస్థితిని కోర్టు ఎలా చూస్తుందో.. వేచి చూడాల్సి ఉంది.
కోర్టులపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం… న్యాయమూర్తుల్ని దూషించడం.. బెదిరించడం… వారి ఆదేశాలను పాటించకపోవడం వంటివి ఏపీ సర్కార్కు ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఇంతే జరిగాయి. మరోసారి జరుగుతోంది. న్యాయవ్యవస్థ మాత్రం ఎప్పటికప్పుడు సంయమనం పాటిస్తోంది. ఈ కారణంగా మరింత అలుసైపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో కోర్ట ుఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.