వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరింత దూకుడుగా పోరాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోరాటాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. తనపై కేసులు పెట్టి .. అరెస్ట్ చేయించి.. ధర్డ్ డిగ్రీ ప్రయోగించినదానికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారేమో కానీ.. ఆయన పూర్తి సమయం అందు కోసమే కేటాయిస్తున్నారు. తాజాగా తెలంగాణ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులను సీబీఐ, ఈడీ సరిగా దర్యాప్తు చేయడం లేదని పిల్లో ఆయన పేర్కొన్నారు. దర్యాప్తులో బయటకొచ్చిన అంశాలను సీబీఐ, ఈడీ వదిలిపెట్టాయని రఘురామ పిటిషన్లో పేర్కొన్నారు. కేసులకు తార్కిక ముగింపు ఇవ్వడంలో సీబీఐ, ఈడీ విఫలమయ్యాయని ఆయన వెల్లడించారు. అన్ని అంశాలను దర్యాప్తు చేసేలా సీబీఐ, ఈడీని ఆదేశించాలని పిల్లో రఘురామ కోరారు.
ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరుగుతోంది. ఎనిమిదో తేదీన జగన్‌తో పాటు రఘురామ, సీబీఐ కూడా కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంది. ఆ తర్వాత విచారణలో ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టం. బెయిల్ షరతులు ఉల్లంఘించడంలేదని సీబీఐ అఫిడవిట్ వేస్తే.. జగన్మోహన్ రెడ్డికి రిలీఫ్ లభిస్తుంది. ఒక వేళ.. సీబీఐ కూడా.. ఆయన సాక్ష్యులను… సహ నిందితులకుభారీగా లబ్ది చేకూరుస్తున్నారని… ఆరోపిస్తే…జగన్‌కు ఇబ్బంది అవుతుంది. ఈ విచారణ కీలక దశలో ఉండగానే… హైకోర్టులో రఘురామ పిటిషన్ వేశారు.
సీబీఐ జేడీగా లక్ష్మినారాయణ ఉన్నప్పుడు.. జగన్ అక్రమాస్తుల కేసు మూలాల్లోకి వెళ్లారు. విదేశాల నుంచిపెద్ద ఎత్తున నల్లధనం పెట్టుబడుల రూపంలో వచ్చిందని గుర్తించి… ఆయాదేశాలకు సమాచారం కోసం లేఖలు రాశారు. ఆ ఎపిసోడ్ అంతటితో ఆగిపోయింది. బహుశా.. ఈ అంశాలపైనే రఘురామకృష్ణరాజు.. హైకోర్టును ఆశ్రయించి ఉంటారని భావిస్తున్నారు. సీబీఐ, ఈడీ ఎలాంటి అంశాలను గుర్తించి.. వాటిని నేరాలుగా చూడకుండా.. విచారణ చేయకుండా పక్కన పడేసిందో.. రఘురామ హైకోర్టు వాదనల్లో వెల్లడించాల్సి ఉంది. రఘురామ రాస్తున్న లేఖలే వైసీపీకి తలనొప్పులుగా మారాయంటే.. ఆయన కోర్టుల్లో వేస్తున్న పిటిషన్లు మరింత టెన్షన్‌కు గురి చేస్తున్నాయి. రఘురామకృష్ణరాజు దూకుడు చూస్తే… జగన్ కేసుల్ని తానే దర్యాప్తు చేసేలా ఉన్నారని.. వైసీపీలో చర్చ జరుగుతోంది.