ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐదేళ్ల పాటు నర్సాపురం ఎంపీగా ఉన్నా సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టలేని పరిస్థితిని జగన్ కల్పించారు. ఈ సారి మాత్రం ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి తనదైన మార్క్ చూపించాలనుకుంటున్నారు. గెలిచిన వెంటనే సమస్యలన్నింటినీ లిస్టవుట్ చేసుకుని .. ప్రభుత్వం ఇచ్చే నిధుల గురించి ఆలోచించకుండా క్రౌడ్ ఫండింగ్ తో కొత్త రాజకీయం ప్రారంభించారు.
ప్రభుత్వంతో పనులు చేయించుకోవాలంటే… ముందు ప్రతిపాదనలు పెట్టాలి . అనుమతులుతెచ్చుకోవాలి. నిధుల విడుదల చేయించుకోవాలి. ఆ తర్వాత కాంట్రాక్ట్ ఇచ్చి పనులు ప్రారంభించాలి. ఇలాంటి పనులు పెద్ద పెద్ద వాటికి చేయవచ్చు.. కానీ సింపుల్ గా అయ్యే కొన్ని పనుల్ని ప్రజా భాగస్వామ్యంతో చేయిస్తే.. సులువుగా అయిపోతుందని అంచనా వేశారు. అందుకే వెంటనే ఉండి నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం ఓ ఫండ్ ప్రారంభించారు. ఐదు లక్షలు మొదట తానే డొనేట్ చేశారు. మిగతా వారు కూడా డొనేట్ చేయాలని సూచించారు. ఒక్క రోజులోనే కోటి రూపాయలు సమకూరినట్లుగా రఘురామ ప్రకటించారు.
గతంలో చంద్రబాబు ఓ ప్రత్యేకమైన జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ కాలనీలు, ఊళ్లకు కావాల్సిన పనులు ఏమైనా ఉంటే.. ముఫ్ఫై శాతం అందరూ ఫండ్‌గా సేకరించుకుంటే… మిగతా మొత్తం ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. అలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. మరోసారి అలాంటి ప్రోగ్రాం చేపడితే… పనుల్లో పారదర్శకతో పాటు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు.. ముఖ్యంగా గత ఐదేళ్లుగా పడకేసిన సౌకర్యాలు ప్రజలకు సమకూరే అవకాశం ఉంది.