వైసీపీ సర్కార్‌పై ఎలా పోరాడాలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ బీజేపీ నేతలకు దారి చూపారు. ఆ దారిలో సోము వీర్రాజు అండ్ బృందం విమర్శలు ప్రారంభించారు. వైఎస్ జగన్‌కు డబుల్, ట్రిపుల్ స్టికర్ సీఎం అని పేరు పెట్టామని ఆయన ప్రకటించారు. ఎందుకంటే కేంద్ర ప్రాయోజిత పథకాలన్నింటికీ జగన్ పేరు పెట్టుకుంటున్నారట. గత వారం రఘురామకృష్ణరాజు మధ్యాహ్న భోజన పథకంతో పాటు మరికొన్ని పథకాలకు జగనన్న పేరు పెట్టి పంపిణీ చేస్తున్నారని వాటికి నిధులు కేంద్రం ఇస్తోందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఫిర్యాదు చేశారు.
ఆమె ఏపీ ప్రభుత్వానికి ఘాటు లేఖ రాసింది. పథకాల పేర్లు మార్పు కుదరదని స్పష్టం చేసింది. ఆయా పథకాలకు ఇచ్చిన నిధుల లెక్కలు చెప్పాలని ఆదేశించింది. ఆ తర్వాత రోజు రఘురామకృష్ణరాజు ప్రెస్‌మీట్ పెట్టి ఎన్నికేంద్ర ప్రాయోజిత పథకాలకు జగన్ పేరు పెట్టుకున్నారో లెక్క చెప్పారు. వాటన్నింటికీ జగన్ పేరు తీసేయాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని కూడా ప్రకటించారు. ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు ఆ పథకాల గురించి మాట్లాడటం ప్రారంభించారు. కేంద్ర నిధులతో పథకాలు చేపట్టి జగన్ బొమ్మ పెట్టుకుంటున్నారని అందుకే ఆయనను డబుల్ స్టిక్కర్.. ట్రిపుల్ స్టిక్కర్ సీఎం అంటున్నామని చెప్పుకొచ్చారు.
గతంలో చంద్రబాబు కూడా కేంద్ర ప్రాయోజిత పథకాలకు తన పేరు పెట్టుకునేవారు. అప్పుడు బీజేపీ నేతలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కానీ ఇటీవలి వరకు ఏపీ బీజేపీ నేతలు.. జగన్ పేరు పెట్టుకోవడాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం చురుకుపుట్టినట్లుగా ఉంది. ప్రకటనలు ప్రారంభించారు.