నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ హైకమాండ్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో విజయసాయిరెడ్డి.. నోటీసు జారీ చేసి వారం రోజుల్లో సమాధానం చెప్పాలన్నారు. గత పది రోజులుగా.. పార్టీకి.. పార్టీ నిర్ణయాలకు.. పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రకటలను.. షోకాజ్ నోటీసులో వివరించి.. వాటికి వివరణ ఇవ్వాలని ఆదేసించారు. లేకపోతే.. తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రఘురామకృష్ణంరాజు.. తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గే అవకాశం లేదు కాబట్టి.. విజయసాయిరెడ్డి జారీ చేసిన షోకాజ్ నోటీసుకు కూడా దూకుడు తగ్గకుండా.. సమాధానం ఇస్తారని అంచనా వేస్తున్నారు.
వాస్తవానికి రఘురామకృష్ణంరాజు పార్టీ అధినేత జగన్ గురించి ఒక్కటంటే.. ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆయనను పొగుడుతూనే ఉన్నారు. ఏబీఎన్ లాంటి చానళ్లతో మాట్లాడేటప్పుడు కూడా మరో మూడు టర్మ్ లు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారని గట్టిగా చెప్పారు. అయితే జగన్ చుట్టూ కోటరీ ఉందని.. తమను ఆయనను కలవనివ్వడం లేదని ఆరోపిస్తున్నారు. జగన్ కలిసే అవకాశం వస్తే.. తన బాధలు చెప్పుకుంటానని.. చెబుతున్నారు. అయితే.. పార్టీలోని ఇతర నేతలపై… పార్టీ విధానాలపైన మాత్రం ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఆయన తీరు ఇబ్బందికరంగా మారడంతో ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టాలని భావిస్తున్నారు.
తనకు ప్రాణహాని ఉందని.. కేంద్రహోంమంత్రికి లేఖ రాయడం.. వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల నుంచే ఉందని… ఆరోపించడం.. హైకమాండ్‌కు మరింత కోపం తెప్పించింది. ఎమ్మెల్యేలను కించ పరిచారన్న కారణాన్ని కూడా షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. రఘురామకృష్ణంరాజు నేడో రేపో.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో.. షోకాజ్ నోటీసు జారీ చేయడం.. ఆసక్తి రేపుతోంది. వారం తర్వాత ఆయనను సస్పెండ్ చేయడమో… పార్టీ నుంచి బహిష్కరించడమో చేస్తారని అంచనా వేస్తున్నారు. ఈ లోపు పరిస్థితులు ఏమీ మారకపోతే.. అదే జరగొచ్చంటున్నారు.