రఘురామరాజు తనకు తాను న్యాయం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రభుత్వం ఏదో చేస్తుందని ఆగడం లేదు. తానే రంగంలోకి దిగి తనను కొట్టించిన వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా తులసిబాబు వేసిన బెయిల్ పిటిషన్లోనూ ఇంప్లీడ్ అవుతానని పిటిషన్ వేశారు. ఆయన దాడి చేసింది తనపై కాబట్టి తన వాదనలు కూడా వినాలని ఆయన హైకోర్టుకు వెళ్లారు.
తులసీబాబు అత్యవసర బెయిల్ పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంలో తనకేమీ సంబంధం లేదని అంటున్నారు. మాముూలుగా అయితే ఆయనను అరెస్టు చేసేవారో లేదో తెలియదు కానీ.. ఆయన తో పాటు ఆయన అనుచరులు పోలీసులపై చేసిన రుబాబు వల్ల అర్థరాత్రి అరెస్టు చేశారు. ఇప్పుడు బెయిల్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన జైల్లోనే ఉండేలా చేసేందుకు రఘురామ రంగంలోకి దిగారు.
పోలీసులు గట్టి వాదనలు వినిపిస్తారన్న నమ్మకం లేదేమో కానీ.. ఆయన స్వయంగా ఇంప్లీడ్ అయ్యారు. ఆయన పోలీసుల్ని బెదిరించిన వైనం.. ఆయన అనుచురులు పోలీస్ స్టేషన్లో చేసిన రచ్చ గురించి కోర్టులో ఎక్కువగా చెబుతున్నారు. గతంలోనూ తనపై దాడి వ్యవహారంలో రఘురామ న్యాయపోరాటం చేస్తున్నారు. కాల్ డేటా భద్రపరిచేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. రఘురామ పోరాటం ఫలితంగా.. విజయ్ పాల్, తులసీబాబు అరెస్టు అయ్యారు. పీస్ సునీల్ ను అరెస్టు చేయాలని రఘురామ డిమాండ్ చేస్తున్నారు. జీజీహెచ్ మాజీ హెడ్ ప్రభావతి పరారీలో ఉన్నారు.
పుట్టినరోజు నాడు తనను చంపేందుకు పెద్ద స్థాయిలో కుట్ర జరిగిందని అలా కుట్ర చేసిన ఎవర్నీ వదిలేది లేదని.. రఘురామపోరాడుతున్నారు. ప్రభుత్వం పూర్తి స్తాయిలో దృష్టి పెట్టడం లేదని అసంతృప్తి చెందుతున్నారు. ప్రభుత్వం కూడా సీరియస్ గా దృష్టి పెడితే ఈ కేసు జగన్ దగ్గరకే వస్తుందని ఆయన చెబుతున్నారు.