రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్ పదవీ కాలం సెప్టెంబర్ 4తో ముగుస్తుంది. మళ్ళీ రెండవసారి ఆ పదవిలో కొనసాగదలచుకోలేదని తన సహోద్యోగులందరికీ ఇవ్వాళ్ళ ఆయన ఒక మెసేజ్ పంపారు. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు స్పష్టం చేశారు. పదవీ విరమణ తరువాత మళ్ళీ ప్రొఫెసర్ వృత్తిలో చేరాలని నిశ్చయించుకొన్నట్లు తెలిపారు. దేశానికి ఎప్పుడు తన సేవలు అవసరమున్నా అందుకు సిద్దమని తెలిపారు.
రఘురామ రాజన్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టే ముందు అంతర్జాతీయ ద్రవ్యనిధికి ప్రధాన ఆర్దికవేత్తగా సేవలందించారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆ రెండు చోట్ల తన పని తీరుతో అందరి ప్రశంశలు అందుకొన్న రాజన్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా కూడా చాలా సమర్ధంగా పనిచేసి ప్రభుత్వ పెద్దలని, దేశంలో పారిశ్రామికవేత్తలని మెప్పించారు. కానీ భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి రాజ్యసభ సభ్యుడిగా డిల్లీలో అడుగుపెట్టినప్పటి నుండి ఆయనకి అవమానకర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చింది.
సుబ్రహ్మణ్యస్వామి తరచూ రాజన్ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేస్తూ, ఆయనని తక్షణం పదవిలో నుంచి తొలగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్రమంత్రులు, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎవరూ కూడా సుబ్రహ్మణ్యస్వామిని వారించలేదు. రఘురామ రాజన్ కి అండగా నిలబడలేదు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వంటి అత్యున్నత హోదాలో పని చేస్తున్న రాజన్ అది చాలా అవమానకరంగా భావిస్తే సహజమే. సుబ్రహ్మణ్య స్వామి విమర్శలు మొదలుపెట్టినప్పుడే ఆయన రాజీనామా చేస్తారని అందరూ ఊహించారు. కానీ తన పదవీ కాలం ముగిసే వరకు పనిచేసి హుందాగా తప్పుకోవాలని రాజన్ నిశ్చయించుకొన్నారు. అటువంటి అత్యున్నతమైన పదవిలో ఉన్న వ్యక్తిని కూడా రాజకీయ నాయకులు విమర్శలు చేయడం, వివాదం సృష్టించడం వలన ప్రపంచ దేశాల దృష్టిలో భారత ప్రతిష్టే మసకబారినట్లయింది.