ఏపీలో కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని జోరుగా ప్రచారం జరుగుతోన్న వేళ మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. శాసన సభాపతి చైర్ లో ఎవరిని కూర్చోబెట్టనున్నారు..? అనే దానిపై బిగ్ డిస్కషన్ కొనసాగుతోంది.
అందరి అంచనాలు నిజమై రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి, ఉండిలో రఘురామకృష్ణంరాజు గెలుపొందితే ఆయనను స్పీకర్ చేస్తారని ప్రచారం జోరుగా జరుగుతోంది. రఘురామను అవమానించిన జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలంతా రఘురామను అద్యక్షా అని అనాల్సిందేనని.. అది జగన్ కు విధించబోయే మొదటి శిక్ష అవుతుంది అన్న భావనలో టీడీపీ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
నరసాపురం సిట్టింగ్ ఎంపీగానున్న రఘురామకృష్ణంరాజు ఈసారి ఎన్నికల్లో అదే స్థానం నుంచి బీజేపీ టికెట్ ఆశించారు. ఆయనకు టికెట్ ఇచ్చేందుకు బీజేపీ మొదట సుముఖత వ్యక్తం చేసినా ఆ తర్వాత టికెట్ నిరాకరించడం జగన్ కుట్ర అని రఘురామ అనుమానించారు. తాను శాసన సభకు ఎన్నికై, జగన్ తో అద్యక్షా అని పిలిపిచుకుంటానని అప్పట్లో వ్యాఖ్యానించారు.
అయితే, ఎన్నికల చివరి నిమిషంలో టీడీపీలో చేరిన రఘురామను ఉండి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిపింది. అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఖాళీ చేయించి మరీ రఘురామను పోటీలో నిలిపారు చంద్రబాబు. దీంతో చంద్రబాబు సైతం కూటమి అధికారంలోకి వస్తే రఘురామను ఆయన కోరిక మేరకు స్పీకర్ చేసేందుకు సంకోచించకపోవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.