నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారశైలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. పార్టీ అధ్యక్షుడు జగన్ ఏది చేయవద్దంటే… ఆయన అదే చేస్తున్నారు. పైగా తాను చేసిందే కరెక్టని.. జగన్ చెప్పినదానికి వ్యతిరేకంగా తాను ఏమీ చేయలేదని వాదిస్తున్నారు. పార్లమెంట్లో తెలుగు భాష కోసం ఆయన మాట్లాడిన విషయంపై … జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రఘురామకృష్ణంరాజు నుంచి వివరణ తీసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జ్.. వైవీ సుబ్బారెడ్డికి జగన్ ఆదేశించినట్లుగా చెబుతున్నారు. ఈ విషయం కొన్ని మీడియాల్లో ప్రచారం జరగగానే… ఆయనే నేరుగా వైవీ సుబ్బారెడ్డికి ఫోన్ చేశారు. మీడియాలో ఇలా వస్తోందని.. వివరణ ఇమ్మంటారా అని అడిగినట్లుగా తెలుస్తోంది. అయితే.. దీనిపై తర్వాత మాట్లాడదామని.. వైవీసుబ్బారెడ్డి చెప్పినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
పార్లమెంట్ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలన్నదానిపై… చర్చించేందుకు విజయసాయిరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా.. రఘురాకృష్ణంరాజు రాలేదు. పార్టీ లైన్ ను దాటి ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని.. జగన్ చెప్పినా ఆయన లైట్ తీసుకుంటున్నారు. ఎంపీలతో జరిగిన భేటీలో జగన్.. రఘురామకృష్ణంరాజు శైలిని పరోక్షంగా హెచ్చరించినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడది డైరక్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే.. తాను ఇంగ్లిష్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదని… తెలుగుకు మద్దతుగా మాట్లాడానని మాత్రమే.. రఘురామకృష్ణంరాజు చెబుతున్నారు. తెలుగుకు మద్దతుగా మాట్లాడటం అంటే.. ఇంగ్లిష్‌ను వ్యతిరేకించడమేననేది.. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి ఫిలాసఫి కాబట్టి.. రఘురామకృష్ణంరాజు తప్పు చేశారని.. వైసీపీ అగ్రనేతలు ఫిక్సయ్యారు.
రఘురామకృష్ణంరాజు తెలుగు విషయంలో.. వెనక్కి తగ్గే సూచనలు లేవు. ఆయన గట్టిగానే ఉన్నారు. ఆయన కేంద్రమంత్రులతో.. ప్రధానమంత్రితో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. అందుకే.. ఓ పార్లమెంటరీ స్థాయీ సంఘం పదవి కూడా వచ్చింది. పైగా.. ఆయనపై.. బ్యాంక్ రుణాల ఎగవేత కేసులు ఉన్నాయి. జగన్ దూరం పెడితే.. ఆయన బీజేపీకి దగ్గరవుతారు. దాని వల్ల.. ఆయనకు చాలా మేలు జరుగుతుంది. ఈ కోరణంలోనే రఘురామకృష్ణంరాజు.. వైసీపీ అధినాయకత్వ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. వైసీపీలో ఈ వివాదం ఏ మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి…!