‘ఆయనే ఉంటే మంగలితో పనేముందని’ మన పల్లెసీమల్లో ఒక మొరటుసామెత వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యక్తం చేస్తున్న ఆవేదన ఈ సామెతనే గుర్తుకు తెస్తున్నది. రైల్వే బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయం, అలాగే.. విశాఖకు ప్రత్యేకజోన్ రాకపోవడం గురించి రఘువీరారెడ్డి తన ఆవేదనను తీవ్రంగా పంచుకున్నారు. ఆయన పీసీసీ సారధి గనుక.. సహజంగానే విశాఖకు రైల్వే జోన్ రాకపోవడం అనేది చంద్రబాబు వైఫల్యం అని ఆయన నిందలు వేసేశారు. అక్కడితో ఆగితే బాగుండేది. ఎటూ ప్రభుత్వాన్ని విమర్శించడం వారి బాద్యత గనుక.. చక్కగానే చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ మధ్యలో ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రస్తావన కూడా తీసుకువచ్చారు.
వైఎస్ఆర్ బతికే ఉంటే గనుక.. విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ వచ్చి ఉండేదంటూ.. రఘువీరా పేర్కొనడం విశేషం. వైఎస్ఆర్కు వీరభక్తులైన అప్పటి మంత్రివర్గ సహచరుల్లో రఘువీరా కూడా ఒకరు అనే సంగతి అందరికీ తెలిసినదే. తదనంతర పరిణామాల్లో ఆయన వైకాపా వైపు మొగ్గకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే వైఎస్ మీద భక్తిని మాత్రం ఆయన తగ్గించుకోలేదు. వైఎస్ కాంగ్రెస్ తీర్చిన, కాంగ్రెస్ పట్ల విశ్వాసం ఉన్న నాయకుడు అంటూనే వచ్చారు. వైఎస్ హయాంలో రైల్వే బడ్జెట్ రాష్ట్రానికి అన్యాయం చేస్తే.. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి వైఎస్ చాలా సాధించుకు వచ్చారని అంటున్నారు.
అయితే తొలుత చెప్పుకున్న సామెత లాగా.. వైఎస్ బతికి ఉంటే అంటూ సన్నాయి నొక్కులు నొక్కడంలో అర్థం ఉందా? ఆ మాటకొస్తే.. ‘వైఎస్ఆర్ బతికే ఉంటే…’ అనే పదబంధాన్ని సొంతవాక్యాల్లో ఉపయోగించమని పురమాయిస్తే.. నాయకులు అనేక కాంబినేషన్లు తయారుచేస్తారు. వైఎస్ బతికేఉంటే అసలు రాష్ట్ర విభజన జరిగేదేనా? ఏపీ ప్రాంతానికి ఇలా నిధుల కొరతలో అవస్థలు పడాల్సిన అవసరం వచ్చేదేనా? ఇలా చాలా తయారవుతాయి.
అయితే రఘువీరా అలాంటి అర్థంలేని వాక్యాలను మానుకుని.. నిర్మాణాత్మకంగా తాము ప్రతిపక్షంగా ఏం చేయగలరో ఆలోచిస్తే మంచిది. రైల్వే బడ్జెట్ మీద చర్చ సందర్భంగా తమ పార్టీ అధినేత్రి సోనియా, రాహుల్ లు ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై లోక్‌సభలో గళం విప్పేలా ఆయన విన్నవించవచ్చు. తద్వారా తమ పార్టీ యొక్క నిబద్ధతను ఆయన నిరూపించుకునే ప్రయత్నం చేయవచ్చు. పార్టీ పట్ల ఏపీ ప్రజల్లో సానుభూతి తీసుకువచ్చే ప్రయత్నం చేయవచ్చు. అలాంటి పనిచేస్తే బాగుంటుంది గానీ.. వైఎస్సార్ బతికి ఉంటే అలా ఉండేది.. ఇలా ఉండేది.. ఇప్పుడు చంద్రబాబు ఉండడం వల్ల ఏం జరగడం లేదు.. అంటూ వృథామాటలడడం ఎందుకు? అని జనం ప్రశ్నిస్తున్నారు.