హైదరాబాద్: ప్రత్యేకహోదాపై బహిరంగచర్చకు సిద్ధమా అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిన్న విసిరిన సవాల్‌కు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు సవాల్‌ను స్వీకరిస్తున్నామని రఘువీరా ఇవాళ హైదరాబాద్‌లో చెప్పారు. ప్రత్యేక ప్యాకేజి కావాలని ప్రధానిని అడిగినమాట నిజం అవునో, కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలో ఏం అడిగారో తనకు తెలియదని, భూసేకరణకు తాను వ్యతిరేకం అని సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రి కేఈ చెప్పారని – దీనిపైకూడా చర్చించాలని రఘువీరా అన్నారు. ముఖ్యమంత్రికి తెలియకుండానే భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు నారాయణ చెబుతున్నారని దీనిపైకూడా చర్చించాలని డిమాండ్ చేశారు. మీ ప్రభుత్వం, మంత్రులు ఇంత చక్కగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు.
మరోవైపు ఉండవల్లి చంద్రబాబుకు రాసిన లేఖలో చర్చకు సిద్ధమన్న వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. తనకూ చర్చలో పాల్గొనటానికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తేది, వేదిక ఏదైనా ఎజెండాకు లోబడి తాను మాట్లాడతానని అన్నారు. విద్యుత్, పట్టిసీమ, రాష్ట్రవిభజనపై చర్చలు జరపాలని గతంలోకూడా సీఎమ్‌కు లేఖలు రాశానని పేర్కొన్నారు.
మామూలుగా అయితే ఇలా చర్చలకు సిద్ధమని సవాళ్ళు విసురుకోవటమేగానీ ఈ చర్చలు జరగవు. అందులోనూ ఇవాళ కేఈ, నారాయణ వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వాన్ని మరింత డిఫెన్స్‌లో పడేసిన తర్వాత అస్సలు జరిగే ప్రసక్తే లేదు.