ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితికి ఇప్పటికీ తేడా చూస్తుంటే ఎవరికయినా ‘అయ్యో’ అనిపించక మానదు. పదేళ్ళ తరువాత ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ప్రజలు ఆయనపై చాలా బారీ ఆశలే పెట్టుకొని గెలిపించారు. కానీ ఆ తరువాత నుండే ఆయన గ్రాఫ్ మెల్లిగా పడిపోవడం మొదలయింది. కారణాలు అందరికీ తెలిసినవే. మళ్ళీ చెప్పుకోనక్కరలేదు. కారణాలు ఏవయినా ఇప్పుడు ఆయన కేంద్రానికి, తెలంగాణా ప్రభుత్వానికి, రాష్ట్రంలో ప్రతిపక్షాలకు అందరికీ చాలా అలుసైపోయినట్లు కనిపిస్తోంది. డిల్లీ వెళ్తే ప్రధాని మోడీ పట్టించుకోరు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రులు ‘కబడ్దార్’ అని హెచ్చరిస్తుంటారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు నోటికి వచ్చినట్లు దూషిస్తుంటాయి. ముఖ్యంగా ఇద్దరు రెడ్లు అంటే జగన్మోహన్ రెడ్డి, రఘువీరా రెడ్డి ఆయనని ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా అనరాని మాటలు అంటూనే ఉంటారు.
పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మనకి అడుక్కొనే ముఖ్యమంత్రి కాదు…మనకు రావలసినవి పోరాడిసాధించుకు రాగల ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబు నాయుడు ముప్పైసార్లు డిల్లీ వెళ్లివచ్చానని గొప్పగా చెప్పుకొంటారు కానీ ఆయన సాధించింది ఏమిటి? నిన్న కూడా డిల్లీ వెళ్లి మోడీని కలిసివచ్చారు. కానీ ఏమయింది? ఆయన మాటలు వింటే చాలా బాధ కలుగుతోంది. డిల్లీలో మోడీతో ధైర్యంగా మాట్లాడలేకపోయినా, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా మాట్లాడేంత ధైర్యం లేదా? తెలంగాణాలో ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కట్టుకొంటుంటే, కేసులకు భయపడి రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతున్నా నోరు మెదపకుండా కూర్చొన్నారు,” అని రఘువీరా రెడ్డి ఎద్దేవా చేసారు.
ఇక కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు వంటి నోరున్న నేతలయితే చంద్రబాబు నాయుడుని తిట్టినా తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉన్నారు. ఇంతమంది నోరు పారేసుకొంటున్నా వారెవరికీ ధీటుగా జవాబు చెప్పలేకపోవడం వలన ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని గ్రహిస్తే మంచిది.