రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రప్రభుత్వం అమలుచేయనందుకు, తెదేపా తన ఇద్దరు కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయించాలని జగన్మోహన్ రెడ్డి తరచూ డిమాండ్ చేయడం వింటున్నదే. ప్రత్యేక హోదా వంటి హామీలను నెరవేర్చవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదయితే, జగన్మోహన్ రెడ్డి దానిని గట్టిగా నిలదీసి ప్రశ్నించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడినే లక్ష్యంగా చేసుకొని విమర్శిస్తూ ఇటువంటి డిమాండ్స్ చేస్తుండటం వలన వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. “తెదేపా-భాజపాల మధ్య ఏదో విధంగా చిచ్చుపెట్టి, మా పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి పరితపించిపోతున్నారు కానీ అది ఎన్నటికీ సాధ్యం కాదు” అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు జగన్ ఉద్దేశ్యమేమిటో వివరించి చెప్పినా జగన్ ఆ డిమాండ్ చేయడం మానుకోలేదు. అందుకే దానిని ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు.
ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా ఇంచుమించు అదే డిమాండ్ చేసారు కానీ దానికి వేరే బలమయిన కారణం కనబడుతోంది. కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్ సంస్థ మారిషస్ బ్యాంకుకి రూ.106 కోట్లు బాకి ఎగవేయాలని ప్రయత్నించినందుకు, ఆయనపై కేసు నమోదు చేయడం, దాని విచారణకు హాజరు కమ్మని కోర్టు నోటీసులు పంపడం, హాజరుకానందుకు కోర్టు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం అందరికీ తెలిసిందే.
అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ప్రధాని నరేంద్ర మోడి గానీ ఆయన గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అని రఘువీరా రెడ్డి ప్రశ్నించారు. ప్రధాని, ముఖ్యమంత్రి ఇద్దరూ కూడా తాము అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని గొప్పలు చెప్పుకొంటున్నప్పుడు, బ్యాంకుని మోసం చేసిన ఒక ఆర్ధిక నేరస్తుడయిన సుజనా చౌదరిని అరెస్ట్ చేసేందుకు కోర్టు వారెంట్ జారీ చేసినా ఇంకా ఆయనని కేంద్ర మంత్రి పదవిలో ఎందుకు కొనసాగనిస్తున్నారు? అని ప్రశ్నించారు.
సుజనా చౌదరి బ్యాంకుల నుండి భారీ మొత్తంలో డబ్బు పిండుకొని వాటితో లాభాలు ఆర్జించినప్పటికీ, బ్యాంకులకి తిరిగి చెల్లించవలసిన డబ్బుని ఎగవేస్తుంటే, ప్రధాని, ముఖ్యమంత్రి ఆయనపై చర్యలు తీసుకోవడం మాని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రఘువీరా రెడ్డి విమర్శించారు. కనీసం ఇప్పటికయినా సుజనా చౌదరిని మంత్రి పదవిలో తప్పించి, ఆయనని చట్టానికి అప్పగించాలని రఘువీరా రెడ్డి కోరారు.
జగన్మోహన్ రెడ్డి వాదనతో పోలిస్తే రఘువీరా రెడ్డి వాదన చాలా సహేతుకంగానే ఉందిని అర్ధమవుతోంది. ఈకేసుతో, సుజనా గ్రూప్ సంస్థలతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని వాదిస్తున్న సుజనా చౌదరి అదే నిజమయితే తనపై కేసు నమోదు అయిన వెంటనే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, న్యాయస్థానంలో తన నిజాయితీని నిరూపించుకొని ఉండి ఉంటే, తెదేపా, ఎన్డీయే ప్రభుత్వాలకి చాలా గౌరవంగా ఉండేది. మళ్ళీ ఆయనకే మంత్రి పదవి దక్కేది. కానీ ఈ కేసులో విచారణకు హాజరుకాకుండా అరెస్ట్ వారెంట్ జారీ అయినప్పటికీ తను నిర్దోషినని వాదిస్తున్నారు. దానివలన ఆయనకే కాదు ప్రధాని నరేంద్ర మోడి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవలసివస్తోంది.
ఆయన రాజీనామా చేయనప్పుడు, ప్రధాని లేదా ముఖ్యమంత్రి ఎవరో ఒకరు చర్యలు తీసుకొని ఉంటే బాగుండేది. కానీ వారు కూడా ఈ కేసు ప్రస్తావన చేయకుండా చాలా జాగ్రత్తపడటం గమనిస్తే, ఆయనకి తమ అండదండలున్నాయని చెపుతున్నట్లుంది. విజయ్ మాల్యా పట్ల కొంచెం కరుకుగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడి, తన మంత్రివర్గంలో ఉన్న సుజనా చౌదరిపై కూడా అవే రకమయిన అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు, ఆయన మౌనం వహించడాన్ని ఏమనుకోవాలి? మరి అటువంటప్పుడు న్యాయమూర్తులు సుజనా చౌదరికి వ్యతిరేకంగా తీర్పు చెప్పే సాహసం చేయగలరా? అనే సందేహం కలుగుతోంది.