తెలుగుదేశం పార్టీ ఏపీ లో ప్రస్తుతం అమలు చేస్తున్న ఆకర్ష పథకానికి వైసీపీ ఎమ్మెల్యేలు క్యూ కట్టి మరి వలస వెళ్ళిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇవాళ టీడీపీ నాయకులు ప్రకటించిన ప్రకారం చూసినట్లయితే ఇంకా టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా మరో 17 మంది కూడా ఉన్నారుట. ఇదంతా కార్యరూపం దాలిస్తే వైసీపీ మరింత దారుణంగా దెబ్బ తింటుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు ట్విస్ట్ ఏమిటి అంటే.. జగన్ కు జరుగుతున్నా నష్టానికి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారధి రఘువీరా రెడ్డి ఇపుడు ఆవేదన చెందుతున్నారు. జగన్ పార్టీని వీడి వెళ్లిన వారిని అయన దారుణంగా తిట్టిపోస్తున్నారు.
రఘువీరా రెడ్డి అంటే అయన ప్రస్తుతం ఏపీసీసీ సారధి కావచ్చు గానీ, ఒకప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి పరమ భక్తులు అయిన మంత్రుల్లో ఒకరు అనే సంగతి అందరికీ తెలుసు. వైఎస్ మరణించినప్పుడు, జగన్ ను సీఎం చేయాలనే డిమాండ్ ను లేవనెత్తిన మొదటి బ్యాచ్ నాయకుల్లో రఘువీరా కూడా ఉన్నారు. తదనంతర పరిణామాల్లో , జగన్ సొంత పార్టీ పెట్టుకున్నప్పటికీ అయన మాత్రం కాంగ్రెస్ లొనే ఉండిపోయారు. అయితే ఇప్పుడు జగన్ పార్టీ బలహీన పడుతూ ఉండడం చూసి ఆయనకు కడుపు రగిలిపోయినట్లుగా కనిపిస్తోంది. అందుకే జగన్ పార్టీ ని వీడి వెళుతున్న వారు బిక్షగాళ్ల కంటే హీనులు అంటూ శాపనార్థాలు పెడుతున్నారు.
జగన్ ప్రజలకు క్షమాపణ చెబితే ప్రజలు మన్నించి అయన పార్టీ ని వీడి వెళుతున్న ఎమ్మెల్యే లకు బుద్ధి చెబుతారని రఘువీరా అంటున్నారు. బహుశా కాంగ్రెస్ ను వీడి బయటకు వచ్చినందుకు, జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలనేది రఘువీరా అభిమతం కావచ్చు. కానీ, అసలు పార్టీ ఎమ్మెల్యేల విషయంలోనే మోనార్క్ అనే ముద్రను, నిందలను మోస్తున్న జగన్, కాంగ్రెస్ ను వీడిన దానికి క్షమాపణ చెప్పడం సాధ్యమేనా అంటే అనుమానమే. రఘువీరా, ప్రస్తుతం జగన్ మీద చూపిస్తున్న సానుభూతి, అయన పార్టీ తో మైత్రి బంధం కలుపుకోవడానికి పునాది అవుతుందా అని కూడా పలువురు అనుమానిస్తున్నారు.