ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ పార్టీ నాయకుడు అంటూ వ్యాఖ్యానించారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి. తమ నాయకుడు వైఎస్ బొమ్మ పెట్టుకుని, తమ మీదే జగన్ విమర్శలు చేస్తున్నారంటూ ఖండించారు. ఒక పిచ్చుకలాంటి వైకాపాకి, తమకు ప్రశ్నించే స్థాయి లేదనీ, విమర్శించగలిగే హక్కు లేదని ఆయన మండిపడ్డారు. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరు చేస్తుందని ప్రకటించినా, టీడీపీతో పొత్తు కొనసాగుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పరోక్షంగా టీడీపీకి మద్దతు ఉంటుందని వ్యాఖ్యానించడం, కథనాలు రాయించడం వారి దిగజారుడుతనానికి సాక్ష్యమని రఘువీరా విమర్శించారు.
తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం జగన్ పార్టీకి అలవాటనీ, ఆంధ్రాకి హోదా ఇస్తామని తాము ప్రకటించినా కూడా… ఇవ్వడం అసాధ్యమని చెప్తున్న భాజపాకి ఎలా మద్దతు ఇస్తున్నారంటూ రఘువీరా ప్రశ్నించారు. ఏ పార్టీ మద్దతు ఇవ్వని కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రెంట్ కు జగన్ ఏవిధంగా మద్దతు ప్రకటించారని నిలదీశారు. తెలంగాణలో తెరాసకు అనుకూలంగా ఉండేందుకు అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యలేదనీ, ఆ క్రమంలో తెరాస నుంచి ఎంత సొమ్ము పుచ్చుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాకి ఎందుకు మద్దతు ఇచ్చారో చెప్పాలన్నారు. తమ పార్టీపై తప్పుడు విమర్శలు చేయించి, సొంత పత్రికల్లో తప్పుడు కథనాలు రాస్తున్న వైకాపాకి పుట్టగతులు ఉండవని రఘువీరా మండిపడ్డారు.
నిజానికి, వైయస్ హయాం తమ పాలనగానే ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్ ఏపీలో బాగా వెనకబడింది. ఆ మధ్య ఇదే అంశాన్ని తెరమీదికి బలంగా తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. అంతేకాదు, ఏపీలో వైయస్సార్ పాలన కాంగ్రెస్ దే అంటూ బాగా ప్రచారం చేయాలని హైకమాండ్ కూడా ఆ మధ్య రాష్ట్ర నాయకత్వానికి సూచించింది కూడా. అయితే, ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ దగ్గరకావడంతో ఏపీలో పార్టీ వ్యవహారాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు ఒంటరిపోరు అనే స్పష్టత వచ్చేసింది కాబట్టి… మరోసారి వైయస్సార్ బొమ్మ పెట్టుకుని ముందుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే, వైయస్సార్ పాలన క్రెడిట్ ని… వైకాపా గత చరిత్రగా జగన్ చెప్పుకుంటూ మొదట్నుంచీ ప్రచారం చేసుకుంటున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలనే… వైకాపా బ్లూప్రింట్ గా చూపిస్తున్నారు. మరి, వైయస్ పాలనను తమ హయాంగా చెప్పుకోవడంలో ఏపీ కాంగ్రెస్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.