ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై చివరికి ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా విమర్శించారు. ఎలాగూ ప్రతిపక్షం వైకాపా, భాజపా నేతలు బురద జల్లుడు కార్యక్రమమే పెట్టుకున్నారు. పనిలోపనిగా తాము కూడా అనేస్తే పనైపోతుందని కాంగ్రెస్ నేతలు కూడా వంతపాడేశారు. ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తిరుపతిలో కాంగ్రెస్ నేతలు 48 గంటల దీక్షకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలంటూ ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లింది కేవలం సెల్ఫీల కోసమే అంటూ ఎద్దేవా చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వల్ల ఈ రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో, అంతకంటే ఎక్కువ నష్టం చంద్రబాబు లొంగుబాటు వల్ల జరిగిందని రఘువీరా సూత్రీకరించారు. ఇప్పుడే ఆయన ఢిల్లీకి ఎందుకెళ్లారనీ, మూడేళ్ల కిందట వెళ్లాల్సిందనీ, రెండేళ్ల కిందట వెళ్లినా బాగుండేదని అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలనూ ఢిల్లీకి తీసుకెళ్లాలంటూ చాలా సందర్భాల్లో కోరినా వినలేదన్నారు. ఇన్నాళ్ల తరువాత ఢిల్లీ ఎందుకెళ్లారు..? ఎవర్ని కలిశారు..? కాలేజీ కుర్రాళ్లు సెల్ఫీల కోసం పోటీ పడ్డట్టు, సెల్ఫీల కోసం వెళ్లారు అంటూ విమర్శించారు. ఒక ముఖ్యమంత్రి ఇలా చేయ్యొచ్చా అని ప్రశ్నించారు. పార్లమెంటు మెట్లకు మొక్కుతూ కెమెరా వైపు చూడటాన్ని రఘువీరా తప్పుబట్టారు.
ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే… ఏపీ సమస్యలపై ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు పోరాడాలీ, పోరాడాలీ అని పోరు పెట్టిన పార్టీలే ఇవి..! ఇవాళ్ల, కేంద్రంతో టీడీపీ తెగతెంపులు చేసుకుని… జాతీయ స్థాయిలో ఇతర పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తుంటే… గత ఏడాది ఎందుకు వెళ్లలేదు, రెండేళ్ల కిందట ఎందుకు వెళ్లలేదు అంటూ విమర్శిస్తున్నారు. సరే.. అన్ని పార్టీలనూ తీసుకెళ్లాలని గతంలో తాను చాలాసార్లు చెప్పానని రఘువీరా అంటున్నారు కదా! ఇప్పుడు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రికి ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు..? ఢిల్లీకి వెళ్తే మద్దతుగా నిలుస్తామని గతంలో చెప్పిందీ వారే… తీరా సీఎం ఢిల్లీకి వెళ్లొస్తే, ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నిస్తున్నదీ వారే..? హేమమాలినితో చంద్రబాబు ఉన్న ఫొటో మాత్రమే రఘువీరా చూసినట్టున్నారు. శరత్ పవార్ తోనూ, భాజపా సీనియర్ నేతలతో, తమిళనాడు ఎంపీలతో మాట్లాడిన దృశ్యాలు ఆయనకి ఎవ్వరూ చూపించలేదేమో..! ఏపీ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏపాటిదో విభజన సమయంలోనే తేలిపోయింది. ఇప్పుడు దీక్షలూ నిరసనలూ అంటే ఎవరు నమ్ముతారు..?