తాము ఏదో చేస్తూ ఉన్నట్లుగా, రాష్ట్రం కోసం పాటు పడుతూ ఉన్నట్లుగా కనిపించడానికి నిత్యం ఒక ఎజెండాను భుజాన మోస్తూ తిరుగుతూ ఉండే ఏపీ రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఇప్పుడు తన కార్యక్షేత్రాన్ని హస్తినాపురానికి మార్చారు. ఏ హామీని కేంద్రప్రభుత్వం ద్వారా సాధించడం అసాధ్యమో.. ఆ హామీ గురించి అలుపెరగని, మడమ తిప్పని పోరాటం సాగించడం ద్వారా.. ఎప్పటికీ.. తమ డిమాండు గురించి కేంద్రం పట్టించుకోలేదని నిందించడానికి ఆయన సిద్ధమైపోయినట్లుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం కోటిసంతకాలను రాష్ట్రపతికి సమర్పించే కార్యక్రమానికి ఇప్పుడు ఆయన శ్రీకారం చుట్టారు. దానికి సంబంధించిన వాల్‌పోస్టరును కూడా రాహుల్ ద్వారా ఆవిష్కరింపజేశారు.
రాష్ట్రం కోసం తాము పోరాడుతున్నాం అనే భ్రమను ప్రజల్లో కలిగించడానికి రఘువీరా ఇప్పటికి ఎన్ని రకాల పాట్లు పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఆ పోరాటాలకు ఇప్పుడు ఓ తుదిరూపం ఇస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. 12వ తేదీన విజయవాడ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఛలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల సహా 300 మంది కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్తార్ట. 14, 15, 16 తేదీల్లో రాష్ట్రపతి, ప్రధాని లను కలిసి కోటి సంతకాలు సమర్పిస్తార్ట. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన మట్టి నీరును కూడా కేంద్రానికి కానుకగా ఇస్తారట. దీనితో పాటూ కాస్త సందర్భ శుద్ధిని జత చేస్తూ.. బడ్జెట్లో అన్యాయం గురించి కూడా రఘువీరా వీరంగం వేస్తున్నారు. బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని, హోదా గురించి, రైల్వేజోన్ గురించి ప్రస్తావించలేదని, చంద్రబాబు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని, 30 వేల కోట్ల పోలవరానికి వంద కోట్లు ఇవ్వడం దారుణం అని.. ఇలా కొత్తదనం లేని ఆరోపణలు అన్నిటినీ పోగుచేసి వెల్లడిస్తున్నారు.
అయితే ‘ప్రత్యేకహోదా’ కోసం అని చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ, రఘువీరారెడ్డి సాగిస్తున్న ఈ పోరాటానికి చిత్తశుద్ధి ఉన్నదా? వీరు తమ ప్రయత్నాల గురించి ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలుగుతున్నారా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అంశాన్ని సంచలనంగా మార్చదలచుకుంటే.. పతనమైపోయిన పార్టీకి పీసీసీ చీఫ్ అనే ముళ్లకిరీటం వంటి హోదాను అతి బలవంతం మీద మోస్తున్న రఘువీరా రెడ్డి ఢిల్లీ వెళ్లి.. అక్కడ ధర్నా వంటి నాటకాలకు దిగినంత మాత్రాన ఉపయోగం లేదు. కాంగ్రెసు పార్టీకి చిత్తశుద్ధి ఉంటే.. నిజంగానే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా రావాలనే ఆలోచన, ఈ రాష్ట్రంలో తమ పార్టీని మళ్లీ సజీవంగా చూసుకోవాలనే కోరిక ఉంటే గనుక.. ఏ ప్రధాని అయితే సభాముఖంగా హామీ ఇచ్చాడో.. ఆయననే రోడ్డు మీదికి తీసుకురావాలి.
”ఈ దేశానికి ప్రధానిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి… కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రానికి ‘ప్రత్యేకహోదా ఇస్తాం’ అని పార్లమెంటులో సభాముఖంగా ప్రకటించాను. ప్రస్తుత ప్రభుత్వం – ఆ ప్రకటనను కార్యరూపంలోకి తెస్తూ హోదా ఇవ్వకపోవడం అంటే.. నన్ను, యూపీఏను అవమానించడం కాదు.. ఈ దేశ ప్రభుత్వపు గౌరవాన్ని మంటగలపడమే” అనే వాదనతో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను కూడా వారు ఆ ధర్నాలో కీలకంగా నిలపగలిగితే దానివల్ల ప్రయోజనం ఉంటుంది.
మేధావిగా పేరున్న మన్మోహన్సింగ్ కూడా ఎంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారంటే.. ఉపాధిహామీ ముడిపెట్టి అనంతపురం జిల్లాకు రాహుల్‌తో కలిసి వచ్చినప్పుడు.. సభలో తాను ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ గురించి ఈ గడ్డమీద మాట్లాడారు. అన్యాయం జరిగిందని అన్నారు. మన రాష్ట్రంలో ఆ మాట అనడం వల్ల లాభం లేదు. ఇదే మాట ఆయన సభలో ఎందుకు ప్రస్తావించరు? దానికోసం సభను స్తంభింపజేయడానికి ఎందుకు పూనుకోరు? అనేది తెలుగు ప్రజల ఆవేదనగా ఉంది.
పార్టీలు ఏవైనా, చేస్తున్న ఉద్యమాలు, సమర్థిస్తున్న వాదనలు ఏవైనా వారి ఆరాటం వెనుక అంతిమ ఉద్దేశాలు ఓటు బ్యాంకు రాజకీయాలే అన్నది స్పష్టం. అలాంటి నేపథ్యంలో కొన్ని కులాల మీద ప్రేమ కురిపించి ఆ కులం ఓట్లను మూటగట్టుకోవడానికి మొత్తం పార్లమెంటును స్తంభింపజేస్తూ ఎగబడుతున్నారు గానీ.. యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభిమానాన్ని చూరగొనడానికి నిర్దిష్టమైన, నాటకాలు లేని నిజమైన ప్రయత్నం చేయకపోవడం చాలా దారుణంగా ఉంది.