ప్రాణాలు అర్పించైనా ఆంధ్రాకి ప్రత్యేక హోదా సాధించుకుంటామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అభిప్రాయపడటం విశేషం. గుంటూరులో నిర్వహించిన ఆత్మగౌరవ దీక్షలో ఆయన పాల్గొన్నారు. హోదా సాధనకు నెల రోజులు మాత్రమే సమయం ఉందన్నారు. బడ్జెట్ సమావేశాలు మార్చి 5 నుంచి మొదలౌతాయని, అవి ముగిసేలోగా హోదా సాధించుకోవాలన్నారు. ఆనాడు ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు, విభజన చట్టంలోని అంశాలు అమలు అవుతాయా లేదా అనేది ఈనెలలోగానే తేలాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే, రాహుల్ ప్రధాని కాగానే తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే పెడతారని రఘువీరా హామీ ఇచ్చేశారు..! హోదాకి అనుకూలంగా లేనివారంతా ఆంధ్రాకి ద్రోహులు అవుతారని రఘువీరా మండిపడ్డారు. దమ్ముంటే ప్రత్యేక హోదా వద్దని చెప్పాలంటూ సవాల్ చేశారు. ప్రస్తుతం ప్రజలు చేస్తున్న పోరాటాలు వృధా పోనివ్వమన్నారు. భాజపా అధికారంలోకి వచ్చాక ఇది ఐదో బడ్జెట్ అనీ, దీన్లో కూడా ఆంధ్రాకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమన్నారు.
మొత్తానికి, ప్రత్యేక హోదా నినాదాన్ని కాంగ్రెస్ మళ్లీ భుజానికెత్తుకుంది. ఇంకోపక్క, కేంద్రంలో ఆంధ్రా ప్రయోజనాలే ప్రాతిపదికగా భాజపా సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రాహుల్ గాంధీ కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు కథనాలు వస్తున్నాయి. దీంతో ఆంధ్రాలో కాంగ్రెస్ పునరుజ్జీవం కోసమే వారు ప్రయత్నిస్తున్నారన్నది అర్థమౌతూనే ఉంది. అయితే, రఘువీరా చెబుతున్నారుగానీ.. ఆంధ్రాకి ప్రత్యేక హోదా వద్దన్నవారు ఎవరుంటారు..? కేంద్రం ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీని వదిలేసి.. ఇవ్వలేమన్న హోదా గురించి ఇంకా వేలాడతారేంటి..? కారణాలేవైతేనేం ప్రత్యేక హోదా అనేది సాధ్యం కాదని కేంద్రం తేల్చింది. హోదాలో ఉన్న ప్రయోజనాలనే ప్యాకేజీ ద్వారా ఇస్తామనే కదా కేంద్ర ఆర్థిక మంత్రి స్వయంగా ప్రకటించారు. ఒకవేళ, హోదాకి బదులుగా ఏదీ ఇవ్వమని కేంద్రం చెప్పి ఉంటే ఈ పోరాటాల్లో స్పష్టత ఉండేది. కానీ, ప్యాకేజీ ద్వారా ఇస్తామన్న ప్రయోజనాలను రాబట్టుకునే దిశగా ఈ పోరాటాలు సాగడం లేదు.
హోదా, ప్యాకేజీ.. పేరు ఏదైతేనేం, ఆంధ్రాకు నిధులను రాబట్టుకోవాల్సిన సమయం ఇది. అంతేగానీ, హోదా కోసం ప్రాణాలు అర్పించేందుకు కూడా వెనకాడం, కాదన్నవాడు ఆంధ్రా ద్రోహీ అనే ఉద్వేగపూరిత ప్రకటనల వల్ల సాధించేది ఏముంటుంది..? ఏపీకి ఇప్పుడే హోదా ఇచ్చి తీరాలని డిమాండ్ చేస్తూనే… ఇంకోపక్క రాహుల్ ప్రధాని అయితే తొలి సంతకం దాని మీదే పెడతారంటారు. అంటే, కాంగ్రెస్ ఇప్పుడు చేస్తున్న పోరాటం ఫలితం రాదని ముందే ఒప్పుకుంటున్నట్టా..? తాము అధికారంలోకి వస్తే తప్ప ఆంధ్రాకి న్యాయం జరగదని హామీ ఇస్తున్నట్టా..?