ఆంధ్రప్రదేశ్ లో ఒంటరిగానే పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పాత్ర ఎలా ఉంటుందనేది ఇంకా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం అన్ని పార్టీలూ తలవంచక తప్పలేదన్నారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా పోరాటం చేసిందన్నారు. హోదా, విభజన హామీలు అమలు కావడం, కాకపోవడం అనేది రాబోయే ఎన్నికల మీదనే ఆధారపడి ఉందన్నారు.
ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కచ్చితంగా ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు రఘువీరా. దానికి రాష్ట్రం నుంచి కూడా మద్దతు ఉండాలన్నారు. ఇతర ఏ పార్టీలకు ఓటు వేసినా ప్రత్యేక హోదా రాదనీ, విభజన హామీలు పక్కాగా అమలు కావన్నారు. భాజపా ఏపీకి ఏమీ ఇవ్వనని చెప్పేసిందనీ, వాటిని సాధించుకోవడం ప్రాంతీయ పార్టీలవల్ల సాధ్యం కాదన్నారు. ఒక్క కాంగ్రెస్ కి మాత్రమే సాధ్యమయ్యే పని అనీ, రాహుల్ ప్రధాని కావడం ఖాయమనీ, ఏపీకి హోదా రావడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున టిక్కెట్లు ఆశిస్తున్నవారి దగ్గర్నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ఏపీలో ఏ లక్ష్యంతో కాంగ్రెస్ ఇలా ప్రచారం చేస్తోందనేదే స్పష్టత లేని అంశంగా కనిపిస్తోంది. ఇతర పార్టీలకు ఓటు వేస్తే.. ఏపీకి హోదా రాదని రఘువీరా చెప్పడంలో ఆంతర్యమేంటి..? ఇలా చెబుతూనే మరోపక్క, రాహుల్ ప్రధాని కావాలంటే రాష్ట్రం నుంచి కూడా మద్దతు కావాలంటున్నారేంటి..? రఘువీరా ఆశిస్తున్న మద్దతు ఆంధ్రాలోని ఓటర్ల నుంచా, పార్టీల నుంచా అనే స్పష్టత ఇవ్వడం లేదు. ఇంకో గందరగోళం ఏంటంటే… ఈ మధ్య రఘువీరా మాటల్లో కేవలం ఎంపీ స్థానాలకు ఉద్దేశించి కాంగ్రెస్ వ్యూహాన్ని కొంత స్పష్టంగా చేస్తున్నట్టు ఉన్నాయే తప్ప, ఎమ్మెల్యేల గురించి వ్యూహాత్మకంగా చెప్పడం లేదు! ఈయనేమో, ఆంధ్రాలో ప్రాంతీయ పార్టీలు హోదా సాధించలేవంటారు, ఢిల్లీకి వెళ్తే అక్కడ ప్రాంతీయ పార్టీల కూటమితో కలిసి నడించేందుకు కాంగ్రెస్ సిద్ధమౌతున్న పరిస్థితి ఉంది. రాహుల్ ప్రధాని అయిపోతారని ఆంధ్రాలో రఘువీరా ధీమాగా చెబుతారు. చిదంబరం లాంటి జాతీయ నేతలే రాహుల్ ప్రధాని రేసులో లేరని వ్యాఖ్యానిస్తారు. మొత్తానికి, ఆంధ్రాలో కాంగ్రెస్ పాత్ర ఎలా ఉంటుందని చెప్పడంలో ఇప్పటికీ రఘువీరా గందరగోళ పరిచే వ్యాఖ్యలే చేస్తున్నారు.