ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం మీద పోరాటం చేస్తామని చెబుతున్నారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి! ఇటీవల సుప్రీం కోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ ఏపీకి చేసిన ద్రోహమని, రాజ్యాంగాన్ని కాలరాయడమేననీ తాము భావిస్తున్నామన్నారు. ఇదే విషయమై అధిష్టానికి నివేదించామనీ, వచ్చే పార్లమెంటులో నిలదీయాలని కోరామని రఘువీరా చెప్పారు. ఇదే అంశమై ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఉమెన్ చాందీతో కూడా చర్చించామన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో భాజపా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని హైకమాండ్ ను కోరామని రఘువీరా చెప్పారు. గత పార్లమెంటు సమావేశాల్లో యూపీయే భాగస్వామ్య పక్షాలను కలుపుకుని అవిశ్వాస తీర్మానం ఇచ్చామనీ, దాన్ని ఎదుర్కొనలేక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిరికిపందలా పారిపోయారని ఎద్దేవా చేశారు.
వారి దగ్గర సమాధానం లేదు కాబట్టే, ఎ.ఐ.డి.ఎం.కె. సభ్యులను అడ్డం పెట్టుకుని సమావేశాలు సజావుగా సాగనీయకుండా చేశారన్నారు. అందుకే, ఏపీ ప్రయోజనాల కోసం పోరాడే పార్టీగా మరోసారి అవిశ్వాస తీర్మానం ఈ సమావేశాల్లో పెట్టాలని హైకమాండ్ ను కోరామన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనైనా న్యాయం జరగాలన్న ఆశతో ఐదు కోట్ల ఆంధ్రులు ఎదురుచూస్తున్నారని రఘువీరా అన్నారు! ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం నుంచి ఏపీ ప్రయోజనాలను రాబట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని రఘువీరా చెప్పారు.
సుప్రీం కోర్టుకు కేంద్రం అఫిడవిట్ సమర్పించి చాలారోజులైంది. కానీ, ఇన్నాళ్లకు పోరాడాలనే స్ఫూర్తి కాంగ్రెస్ కి వచ్చినట్టుంది..! ఇప్పుడు మరోసారి అవిశ్వాస తీర్మానం అంటున్నారు కొత్తగా..! నిజానికి, గత పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై ఏపీ అధికార పార్టీ అవిశ్వాసం పెడితే… ఆలస్యంగా స్పందించిందే కాంగ్రెస్ పార్టీ. ఏపీ ప్రత్యేక హోదా విషయమై కర్ణాటక ఎన్నికల ముందు రాహుల్ గాంధీ మాట్లాడే ధైర్యం చెయ్యలేకపోయారు. ఎందుకంటే, ఏపీ ప్రత్యేక హోదాకి మద్దతు ఇస్తే… కర్ణాటక నుంచి కొన్ని పరిశ్రమలు ఏపీకి తరలిపోయే అవకాశం ఉంటుందనీ, ఆ రాష్ట్రంలో అలాంటి సంకేతాలు వెళ్తాయని వ్యూహాత్మంగా కొన్నాళ్లు మౌనంగా ఉండిపోయారు. అప్పుడు ఏపీ కాంగ్రెస్ నేతలు ఎందుకలా అని ప్రశ్నించలేకపోయారు!
ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు అయిపోయాయి. ఏపీలో మరోసారి పార్టీకి పునర్వైభవం కావాలి కాబట్టి… ఇప్పటికిప్పుడు ఏపీ సమస్యలపైనా, విభజన హామీలపైనా పోరాటమంటూ కొత్తగా చిత్తశుద్ధిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి, గడచిన నాలుగేళ్లలో ఏపీ కోసం కాంగ్రెస్ చేసిన పోరాటం ఏంటనేది రఘువీరా చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు, రఘువీరా వెళ్లి హైకమాండ్ ను కోరారనీ, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో అవిశ్వాసం పెట్టేసి, రాష్ట్ర ప్రయోజనాలపై తమకు చాలా చిత్తశుద్ధి ఉందని ప్రచారం చేసుకుంటే సరిపోతుందా..?