ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి.. జగన్ పైన, జగన్ మీడియాపైన, వైసీపీపైన .. ఒక్క సారిగా రోషం పొడుచుకు వచ్చింది. జగన్… బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ ఓ భారీ లేఖ విడుదల చేశారు. ప్రెస్ మీట్ పెట్టి.. తీవ్ర విమర్శలు చేశారు. రఘువీరారెడ్డి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డిని.. వైసీపీని విమర్శించడానికి ఇటీవలి కాలంలో తొలిసారి ప్రెస్ మీట్ పెట్టారు. వైసీపీపై విమర్శల నేపధ్యం అంతా.. రాహుల్ గాంధీ పర్యటన గురించే. కర్నూలులో రాహుల్ గాంధీ పర్యటనకు.. సాక్షి మీడియా సరైన కవరేజ్ ఇవ్వలేదు. ఈ విషయంలో రఘువీరాకేం పట్టింపు లేదు కానీ.. ప్రత్యేకహోదా విషయంలో రాహుల్ ఇచ్చిన హామీపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ.. కథనాలు ప్రచురించడం.. ఎడిటోరియల్స్ రాయడం మాత్రం… ఆయనకు నచ్చలేదు. అందుకే కొన్ని లాజిక్కులతో… వైసీపీ, జగన్ పై విమర్శలు సంధిస్తున్నారు.
ఇంత కాలం ప్రత్యేకహోదా రావాలంటే.. చట్టంలో ఉండాల్సిన అవసరం లేదని… జగన్ చెబుతూ వచ్చారు. ఇప్పుడు చట్టంలో ఎందుకు పెట్టలేదని… ప్రశ్నించడమేమిటని.. రఘువీరా రెడ్డి ప్రధాన విమర్శ. అంతే కాదు.. భారతీయ జనతా పార్టీని వెనుకేసుకొస్తూ.. అప్పట్లో విభజన చట్టంలో.. ప్రత్యేకహోదా అంశాన్ని పెట్టకపోవడం వల్లే… కేంద్రం అమలు చేయడం సాధ్యం కాలేదన్నట్లుగా కథనాలు రాయడంపైనా రఘువీరా మండిపడ్డారు. బీజేపీతో కుమ్మక్కయి… కోవర్టుగా పని చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేకహాదా ఇవ్వని బీజేపీ… వైసీపీ ఇంత వరకూ బలపరిచిందని… ఇప్పుడు కూడా కోవర్టుగానే పని చేస్తోందంటున్నారు. ప్రత్యేకహోదా ఇస్తామంటున్న రాహుల్, సోనియాలపై జగన్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.
ఇది మాత్రమే కాదు.. తెలుగుదేశం పార్టీ నేతల్నీ ఏమీ అనవద్దని.. రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ నేతల్ని ఆదేశించినట్లుగా ఓ కథనం రాశారు. దీనిపైనా.. రఘువీరా మండిపడ్డారు. రాహుల్ గాంధీ పర్యటన మొత్తం తాను ఉన్నానని.. హైదారబాద్ విమానాశ్రయంలో తెలంగాణ నేతలతో మాట్లాడినప్పుడు కూడా తాను ఉన్నానని రాహుల్ గాంధీ ఆ మాట చెప్పలేదన్నారు. అసలు టీడీపీ అధినేత గురించి కానీ.. టీడీపీ గురించి కానీ రాహుల్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. ఓ వార్త రాసేటప్పుడు దానికి సంబంధించిన వివరాలు నిర్దారించుకుని రాయాలనే కనీస జర్నలిజాన్ని జగన్ మీడియా పాటించలేదని మండిపడ్డారు. సహజంగా… కాంగ్రెస్ పార్టీపై జగన్మోహన్ రెడ్డి గతంలో విమర్శలు చేసినా… రఘువీరారెడ్డి పెద్దగా ప్రతిస్పందించిన దాఖలాలు లేవు. ఈ సారి మాత్రం.. కాస్ ఘాటుగానే రిప్లై ఇచ్చారు.