వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి కూడా తెదేపా ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని జోస్యం చెపుతూనే ఉన్నారు. కానీ ఆ జోస్యం ఫలించకపోవడంతో “మరో మూడేళ్ళు ఓపిక పట్టండి తరువాత మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని” ప్రజలకు చెప్పుకొంటూ సంతృప్తిపడుతున్నారు. ఇప్పుడు ఆయనకి రఘువీరా రెడ్డి కూడా తోడయినట్లున్నారు.
ఆయన నిన్న విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంద్రరత్న భవన్ లో మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్రంలో 2050సం.వరకు తెదేపాయే అధికారంలో ఉండాలని చంద్రబాబు నాయుడు కలలుగంతున్నారు. అవినీతి సంపాదన పెరిగిపోవడం చేతనే ఆయనకి ఆ నమ్మకం, అహంకారం కలిగినట్లున్నాయి. కానీ ఆయన ప్రభుత్వానికి ఇంకా కేవలం మూడేళ్ళ సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆ తరువాత రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుంది. వచ్చే ఎన్నికలలో తెదేపాను తప్పకుండా ఓడిస్తాము. అధికారంలోకి వస్తాము,” అని రఘువీరా రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఏవిధంగా ఉందో రఘువీరా రెడ్డికి కూడా తెలుసు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్టీని ప్రజలు పట్టించుకోవడం లేదంటూ పార్టీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వంటి అనేకమంది కాంగ్రెస్ నేతలు పార్టీని వీడిపోయారు. పార్టీలో ఉన్నవాళ్ళు కూడా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయడం లేదు. పార్టీలో ఎవరెంతకాలం ఉంటారో తెలియదు. ఇటువంటి పరిస్థితులలో కూడా రఘువీరా రెడ్డి ఇంత ఆత్మవిశ్వాసం వ్యక్తం చేయడం చాలా గొప్ప విషయమే. కానీ ఆ ముక్క జగన్మోహన్ రెడ్డి చెప్పితే నమ్మశక్యంగానే ఉంటుంది కానీ రఘువీరా నోట వింటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి శల్యసారధ్యం చేస్తునందునే వైకాపా ఎదురుదెబ్బలు తినవలసి వస్తోంది. అదే ఆయన తన పార్టీలో సీనియర్ నేతల సలహా సంప్రదింపులతో సమిష్టి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగినట్లయితే, నేడు ఈ దుస్థితిలో ఉండేదే కాదు. ఆయన తన తీరు మార్చుకొంటే వచ్చే ఎన్నికలలో తెదేపాకు ఓడించి అధికారంలోకి రావడం అసాధ్యమేమి కాదు కనుక ఆయన ఎన్ని బింకాలు పలికినా అవి నమ్మశక్యంగానే ఉంటాయి.