కాంగ్రెస్ అద్యక్షుడు రఘువీరా రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలోఉధృతంగానే పర్యటించారు. రాష్ట్ర విభజన ఫలితంగా శాసనసభలో పూర్తిగా మాయమైన కాంగ్రెస్ను ఎలాగైనా బతికించాలని కనీసం బలం కొంతైనా చూపించాలని ఆయన వ్యూహం. అందుకోసమే నంద్యాలలో స్వతంత్రంగా పోటీకి దిగారు. అక్కడే మకాం వేసి బాగా ప్రచారం చేశారు. వైసీపీ నేతలు బిజెపిని బలపర్చిన కారణంగా తమ పని సులువైందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అంతకు ముందు మెత్తమెత్తగానే మాట్లాడుతూ వచ్చిన రఘువీరా ఇప్పుడు బాహాటంగానే వైసీపీపై ధ్వజమెత్తుతున్నారంటే రాజకీయంగా పరిస్థితి మారడం వల్లనే. వైసీపీ టిడిపి రెంటిపైనా ఏకకాలంలో దాడి చేస్తున్న రఘువీరా ఇప్పుడు అసలు ఉప ఎన్నికనే రద్దు చేయాలని కొత్త పల్లవి ఎత్తుకున్నారు. ఎన్నికల సంఘం తన విధుల సక్రమంగా నిర్వహించడం లేదని కూడా ఆరోపించారు. వాస్తవానికి వామపక్షాలు కూడా టిడిపిని ఓడించాలని మాత్రమే పిలుపునిచ్చాయి గనక దానివల్ల కాంగ్రెస్ కూడా ప్రయోజనం పొందొచ్చు. జనసేన కూడా తటస్థంగానే వుంటానన్నది. కనుక రఘువీరా ఎన్నికనే రద్దు చేయాలనడం రాజకీయ కోర్కె కావచ్చు. విశ్వాసం కూడా జడలి వుండొచ్చు. ఏమైనా ఈ శబ్ద కాలుష్యం మరో సారి తెచ్చిపెట్టుకునే బదులు ఎలాగోలా తతంగం ముగించడమే మంచిది. ఆరోపణల యుద్ధాలు ఉద్రిక్తతలు ఎలాగూ తప్పవు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రచారానికి వస్తారు గనక రాజకీయంగా వేడి ఇంకా పెరుగుతుంది. రఘువీరా కోర్కె నెరవేరదు.