ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎట్టకేలకు ఒక బ్రహ్మాస్త్రం పట్టుకున్నారు. అది కూడా సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి తన ప్రసంగంలో వెల్లడించిన విషయాలనుంచి తెలుసుకున్న సమాచారాన్ని.. ఆయన ఇప్పుడు బ్రహ్మాస్త్రంగా తీర్చిదిద్ది చంద్రబాబు నాయుడు మీదికి ప్రయోగించడానికి సిద్ధపడుతున్నారు. ఈ విషయంలో ఆయన ప్రధాన ప్రతిపక్షం వైకాపా కంటె ఒక అడుగు ముందే ఉన్నారని చెప్పాల్సిందే. ఈ బ్రహ్మాస్త్రం ద్వారా చంద్రబాబునాయుడును ఎంతో కొంత ఇరుకున పెట్టడానికి రఘువీరా రెడ్డికి అవకాశం దొరుకుతుందనడంలో సందేహం లేదు.
పోలవరం డ్యాంకు సంబంధించిన ముంపు మండలాల విషయంలో ఖమ్మం జిల్లానుంచి కొన్ని మండలాలను ఏపీలో కలిపేస్తూ.. విభజన చట్టంలో సర్దుబాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. చట్టం ప్రకారం ఈ మండలాలు ఏపీ స్వాధీనం అయిపోయాయి. ప్రస్తుతం అక్కడ ఏపీ ప్రభుత్వ పరిపాలనే నడుస్తున్నది. ఖమ్మం జిల్లాలోని భద్రాచలానికి ఎగువన ఆ మండలాలు గ్రామాలు ఉంటాయి. ఆ మండలాలు ఏపీలోకి వెళ్లిపోవడం వలన భద్రాచలం పరిసర ప్రాంతాలు తగ్గిపోతాయి. ఈ విషయంలో కేసీఆర్ చొరవ చూపించారు. భద్రాచలం పరిసరాల్లో ఉండే కొన్ని గ్రామాలను తిరిగి తెలంగాణకు యిచ్చేయవలసిందిగా కోరానని, ఇందుకు చంద్రబాబునాయుడు కూడా అంగీకరించారని కేసీఆర్ చెబుతున్నారు. కేంద్రంతో మాట్లాడి ఈ గ్రామాలను వెనక్కు తీసుకోవడం త్వరలోనే జరుగుతుంది అంటున్నారు.
సరిగ్గా ఇదే మాటలను పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పట్టుకున్నారు. పోలవరం ముంపు గ్రామాలు గనుక ఏపీ పరిధిలోకి వచ్చిన గ్రామాలను ఇప్పుడు మళ్లీ తెలంగాణకు తిరిగి ఇవ్వడం అంటే.. ప్రాజెక్టు ప్రయోజనాలను పణంగా పెడుతున్నట్లే కదా అనే వాదన లేవనెత్తుతున్నారు. కేసీఆర్ ఎలా చెబితే అలా చంద్రబాబునాయుడు ఆడుతున్నారని, చంద్రబాబును ఆడించే మంత్రదండం కేసీఆర్ చేతిలో ఉన్నదని రఘువీరా విమర్శించడం విశేషం. టీడీఎల్పీ సమావేశంలో కనీసం చర్చించకుండానే ఈ గ్రామాలను తిరిగి ఇచ్చేయడానికి చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం దారుణం అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ముంపు కోటాలో ఏపీ పరిధిలోకి వచ్చిన గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇచ్చేయడం అనేది చంద్రబాబు నిర్ణయాల విషయంలో మచ్చగా మారే అవకాశం పుష్కలంగా ఉన్నదని పలువురు భావిస్తున్నారు.
మరో వైపు మంత్రి దేవినేని ఉమా మాత్రం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని.. ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణ కు ఇవ్వడం అనేది జరగని పని అని సెలవిస్తున్నారు. మంత్రి గారు ఇలా చెప్పడంలో ఆశ్చర్యం లేదు గానీ.. కేసీఆర్ చెబుతున్నవి అబద్ధాలు అనే సంగతి, చంద్రబాబు నోటిద్వారా వస్తే తప్ప నమ్మలేం.